BJP Agitation at YS Jagan Mohan Reddy House: తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు అవశేషాలకు మాజీ ముఖ్యమంత్రి జగన్ కారణమంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్ నివాసాన్ని ముట్టడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ నివాసం వద్ద గుంటూరు జిల్లా బీజేపీ నేతలు ఒక్కసారిగా మెరుపు వేగంతో వచ్చి ఆందోళన నిర్వహించడంతో, అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది .
జగన్ ఇంటి వద్దకు భారీగా చేరుకున్న ఆ పార్టీ శ్రేణులు గోవింద నామ స్మరణ చేస్తూ, జగన్‌కు, అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. భారీ గేటు మూసేసి ఉండటంతో, జగన్ నివాసంలోకి, వైఎస్సార్సీపీ కార్యాలయంపైకి కాషాయ రంగు బాల్స్, చెప్పులు విసిరారు. ఆ తర్వాత జగన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
కోట్లాది హిందువుల మనోభావాలను జగన్ దెబ్బతీశారని ఆరోపించారు. కమిషన్ల కక్కుర్తి కోసం నాసిరకమైన నెయ్యిని వినియోగించారని జిల్లా బీజేపీ నాయకులు చెప్పారు. రాష్ట్రంలోనే ప్రధాన ఆలయాలలో దేవుళ్ల ప్రసాదాలను కల్తీమయం చేస్తుంటే, ఆనాటి మంత్రులు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇంటి ముందున్న సెక్యూరిటీ కార్యాలయంపైకి రాళ్లు విసరడంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం విచారణ చేయించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ ఇంటి వద్ద ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
తిరుపతిలో బీజేపీ నేతల నిరసన: తిరుమల ప్రసాదాలను అపవిత్రం చేసిన వారికి శిక్షపడాలని బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి సమీపంలోని వకుళామాత ఆలయం పేరూరు బండ వద్ద ధర్నా నిర్వహించారు. అపవిత్ర పదార్థాన్ని లడ్డు తయారీకి వినియోగించినందుకు వకుళా మాతా మన్నించు తల్లీ అంటూ టెంకాయలు కొట్టారు. దుర్మార్గులను శిక్షించాలని నినాదాలు చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీకి పాల్పడిన వారు భక్త కోటికి క్షమాపణ చేప్పాలని డిమాండ్ చేశారు.
ఈ చర్య అంతర్జాతీయ కుట్ర అని తెలిపారు. శ్రీవారి తల్లి వకుళామాతను క్షమాపణ కోరామన్నారు. గత పాలకమండలిలో పని చేసిన ఈవో ధర్మారెడ్డి, చైర్మన్లు సుబ్బారెడ్డి, కరుణాకర రెడ్డి శిక్షార్హులన్నారు. కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. కమీషన్లకు కక్కర్తి పడి ఇలాంటి చర్యలు చూస్తుంటే, శ్రీవారి నగలు ఉన్నాయా లేవా అన్న అనుమానం కలుగుతుందన్నారు.
టీటీడీ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణ నివేదికపై సీఎం సమీక్ష - Tirumala Laddu Issue