Bike Rider Jaswanth Kumar Creates Indian Book of Records: ఆ యువకుడికి బాల్యం నుంచే బైక్‌పై తిరగడం అంటే చాలా ఇష్టం. సరదాగా బైక్ ఎక్కి ఆడుకునేవాడు. హ్యాండిల్ అటూ ఇటూ తిప్పుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చేవాడు. సీన్ కట్ చేస్తే ద్విచక్ర వాహనంపై తక్కువ సమయంలోనే లద్ధాఖ్ యాత్ర పూర్తి చేసిన పిన్న వయస్కుడిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు లిఖించుకున్నాడు.
హెల్మెట్ ధరించి రైడ్ చేస్తున్న ఈ యువకుడి పేరు జశ్వంత్ కుమార్. విజయవాడ సమీపంలోని నిడమానూరు స్వస్థలం. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి కేఎల్ యూనివర్శిటిలో బీబీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి సాయిబాబు జశ్వంత్‌కు రైడింగ్‌పై ఆసక్తి గుర్తించి శిక్షణ ఇప్పించాడు. అనంతరం, ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన జశ్వంత్ సాహసోపేతమైన యాత్రలకు శ్రీకారం చుట్టాడు.
సాధారణంగా బైక్ రైడింగ్ అంటే నేటి యువతకు ఆసక్తి ఎక్కువే. కానీ, బైక్ రైడింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలనుకున్నాడు జశ్వంత్. విజయవాడ రైడర్స్ క్లబ్‌లో చేరి, సభ్యులతో కలిసి యాత్రలు మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే ఎంతో ఇష్టమైన లద్ధాఖ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి దగ్గర అనుమతి తీసుకుని విజయవాడ నుంచి కన్యాకుమారి, అక్కడి నుంచి లద్ధాఖ్ చేరుకున్నా అని చెబుతున్నాడు జస్వంత్.
లద్ధాఖ్ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ఒక సందర్భంలో ప్రమాదానికి గురైనా లక్ష్యాన్ని చేరుకోవాలనే సంకల్పంతో రైడ్‌ను కొనసాగించానని చెబుతున్నాడు జస్వంత్. కొన్నిచోట్ల ఆహారం, నిద్రపోవడానికి ఇబ్బందులు తలెత్తాయని, ఐనా లద్ధాఖ్ పర్వతాల్లోని వంకర టింకర రోడ్లు, పొగమంచు దాటుకుని యాత్ర పూర్తి చేశానంటున్నాడు జశ్వంత్.
ప్రపంచంలోనే ఎత్తైన రహదారిలో రైడింగ్ చేయడం చాలా ఆనందం ఇచ్చిందని జశ్వంత్ చెబుతున్నాడు. 10వేల 290కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి 29 రోజులు పట్టిందని వివరిస్తున్నాడు. 19 ఏళ్ల వయసులో అది కూడా తక్కువ సమయంలో లద్ధాఖ్ యాత్ర పూర్తి చేసినందుకు ఇండియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్‌లో ఈ యువ రైడర్‌కు చోటు దక్కింది.
సమాజం గురించి తెలుసుకోవడానికి ఈ సుదీర్ఘ ప్రయాణం ఎంతగానో ఉపయోగపడిందని అంటున్నాడు జస్వంత్. దేశంలోని పలురాష్ట్రాల గుండా ప్రయాణం సాగించినందుకు గర్వంగా ఉందంటున్నాడు. ఆయా రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు మంచి అనుభూతిని ఇచ్చాయని చెబుతున్నాడు.
చాలామంది అవసరం కోసం బైక్ నేర్చుకుంటారు. కొంతమంది ఇష్టంతో నేర్చుకుంటారు. కానీ, ఈ యువకుడు అందుకు భిన్నం. బైక్ నేర్చుకోవడమే ప్యాషన్‌గా మలుచుకుని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. దాతల నుంచి సహకారం అందితే ప్రపంచవ్యాప్తంగా యాత్ర చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నాడీ యువ రైడర్.
ఎన్నో ఆర్థిక సమస్యలు అధిగమించి పీహెచ్డీ - కర్ణాటక గవర్నర్ నుంచి పట్టా అందుకున్న యువకుడు