Vijayawada Floods Affected Bhavani Island : బెజవాడలో కొండపైన దుర్గమ్మ, గలగల పారే కృష్ణమ్మ ఎంత ఫేమస్సో నది గర్భంలోని భవానీ ద్వీపానికి అంతే ప్రత్యేకత ఉంది. ఈ అత్యద్భుతమైన ప్రదేశం దుర్గమ్మ పాదాల చెంత ఉంటడంతో అమ్మవారి దర్శనానికి వచ్చిన వారంతా ఇక్కడికి కుటుంబంతో కలిసి వెళ్తారు. కృష్ణా నదిలో బోటులో విహారం చేస్తూ భవానీ ద్వీపానికి చేరుకుని అక్కడి అందాలను ఫోటోలు, వీడియోల్లో బంధించి మధురానుభూతులను మిగుల్చుకుని తిరిగి వెళ్తారు.
ఇలా పర్యాటక శాఖకి కాసుల వర్షం కురిసేది. అలాంటి సర్వాంగ సుందరమైన ప్రదేశం వరద విలయంలో చిక్కుకుని విధ్వంసానికి గురైంది. ప్రకృతి అందాలతో పాటు, మనిషి సృష్టించిన అబ్బురపరిచే కళారూపాలు జల ప్రళయంతో కళా విహీనంగా మారాయి. 20 రోజుల పాటు నదీ గర్భంలో భవానీ ద్వీపం ఇన్నాళ్లకు బయట పడింది. వరద ఉద్ధృతికి స్పీడ్ బోట్లు సైలెంట్ అయిపోయాయి. భారీ బోట్లు ఎక్కడికక్కడే ఆగిపోయి బోసిపోయాయి.
కళావిహీనంగా మారిన కళారూపాలు : భారీ వృక్షాలు నేలకొరగగా ఇసుక తిన్నెలు మూడు అడుగుల మేర పచ్చదనాన్ని కప్పేశాయి. 20 అడుగుల మేర వచ్చిన నీటి ప్రవాహంతో భారీ భవంతుల్లోని హోటళ్లు అన్నీ నీట మునిగి ధ్వంసమయ్యాయి. 600 ఎకరాల్లోని భవానీ ద్వీపం వరద ప్రవాహంలో చిక్కుకుపోయింది. 139 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వినోద, విహార ప్రాంతాలు అందవిహీనంగా మారాయి. భవానీ ద్వీపం ఐకాన్ వద్ద తీరం వెంట నిర్మించిన 12 అడుగుల రోడ్డు సైతం నదిలో కోతకు గురైంది. లక్షలు విలువ చేసే సామగ్రి, యంత్ర పరికరాలు, ఆట వస్తువులు ఎందుకూ పనికి రాకుండా పోయాయి.
Floods Affected Bhavani Island : పర్యాటకుల కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చించి నిర్మించిన మిర్రర్ మేజ్, మేజ్ గార్డెన్స్, తదితర విలువైన నిర్మాణాలు, విహారానికి వినియోగించే సైకిళ్లు, విలువైన బ్యాటరీ వాహనాలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. కీలకమైన దస్త్రాలు కొన్ని కొట్టుకుపోగా మరికొన్ని బురద నీటిలో తడిసి పనికి రాకుండా పోయాయి. జురాసిక్ పార్కు అంతా వరద విలయంతో ధ్వంసమైంది. ఆ ప్రదేశమంతా దారుణంగా దర్శనమిస్తోంది.
పున్నమి ఘాట్‌కు అందాలు తెస్తూ తీరాన నిర్మించిన బెరం పార్క్ పూర్తిగా దెబ్బతింది. పచ్చదనమంతా కనుమరుగైపోయింది. ఏపీ పర్యాటక శాఖ హోటల్ తొలి అంతస్తు వరకు వరద నీటిలో మునిగిపోయింది. ఫలితంగా విలువైన ఫర్నీచర్ అంతా పనికిరాకుండా పోయింది. బోటింగ్ ప్రదేశం ధ్వంసమైంది. దీంతో ఇప్పుడు సిబ్బంది శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. పర్యాటక ప్రాంతానికి పూర్వవైభవం తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందరినీ విశేషంగా ఆకట్టుకునే కీలక ప్రాంతం దారుణంగా దెబ్బతిన్న దుస్ధితిని చూసి పర్యాటకులు సైతం అటువైపు వెళ్లేందుకు జంకుతున్నారు. పర్యాటక ప్రాంతానికి పూర్వవైభవం ఎప్పుడు వస్తుందా అని వారు ఆశతో ఎదురు చూస్తున్నారు.
బుడమేరు కన్నీరు - సర్వం తుడిచి పెట్టేసిందని ఘొల్లుమంటున్న బాధితులు - Home Appliances damage