Peddavagu Project Water Leaked : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయింది. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రాజెక్టులోకి 70వేల క్యూసెక్కుల వరద పోటెత్తింది. అధికారులు రెండు గేట్లెత్తి నీటి విడుదల చేసినప్పటికీ సాంకేతిక లోపంతో మూడో గేటు పని చేయలేదు. గురువారం రాత్రి గండి పడటంతో అశ్వారావుపేట మండలంలోని గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట, మాదారం, కూచిబండ, నారాయణపుర గ్రామాలను నీరు చుట్టుముట్టింది.
ఏపీలోని వేలేరుపాడుకు చెందిన పది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ధాటికి వేలాది ఎకరాల్లోని పంట ధ్వంసం కాగా పొలాల్లో భారీగా ఇసుక మేటలు వేసింది. ముంపు గ్రామాల ప్రజలు రాత్రంతా కొండలు, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకున్నారు. వరద ప్రవాహంలో వందల సంఖ్యలో పశువులు కొట్టుకపోయాయి. ప్రాజెక్టు పరిస్థితిపై సమీక్ష నిర్వహించిన ఇరు రాష్ట్రాల అధికారులు ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు.
"మీర్చిలకు దాదాపుగా 20లక్షల నుంచి 30లక్షల వరకు ఖర్చు అయింది. అదంతా కొట్టుకుపోయింది. అదంతా బాగు చేయటానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. వాగు అంతా గండి పడింది. పోలాలన్ని కొట్టుకుపోయాయి. దాదాపు 70 నుంచి 80 ఎకరాల పంట పొలం నష్టపోయాం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. అసలు ఇళ్లలో ఉన్న సామాగ్రి అంతా కొట్టుకుపోయింది. తినడానికి తిండి కూడా లేదు. అసలు ఏం చేయాలో కూడా తెలియడం లేదు. ఒకేసారి వరద నీరు వచ్చే సరికి అలాగే వెళ్లిపోయాం ఏం చేయాలో కూడా తెలియలేదు. ప్రభుత్వం, అధికారులు స్పందించి మాకు సహాయం చేయాలి." - పెద్దవాగు గండి బాధితులు
నిలిచిపోయిన ప్రజారవాణా, విద్యుత్ సరఫరా : వరదలు దాటికి వందల ఎకరాల్లో పంట పొలాలు కొట్టుకుపోయాయి. అయితే వర్షం మొదలప్పటి నుంచి ముంపు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. వరద ధాటికి పదుల సంఖ్యలో కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. ముంపు ప్రాంతాల్లో ప్రజా రవాణా స్తంభించిపోయింది. తమ ఇళ్లలోని అత్యవసర సామాగ్రి కొట్టుకుపోయిందంటూ గ్రామస్థులు వాపోయారు.
వానలే వానలు - ఉప్పొంగుతున్న వాగులు - బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు - Heavy Rain Alert To Telangana