Cyber Criminals Targets Musi Residents : 'మీ ఇల్లు మూసీ బఫర్‌జోన్‌లో ఉందా? మీ బ్యాంకు లోన్ మాఫీ అయిందా? ఈ వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ లింకులను క్లిక్ చేయండి. ఈ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి'. అంటూ మీ వాట్సాప్‌కు మెసేజ్ వచ్చిందా? అయితే కచ్చితంగా జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అలాంటి వాటికి ఏ మాత్రం స్పందించినా మీ బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైపోంది. అలా ప్లాన్ చేస్తున్నారు మాయగాళ్లు. సైబర్ నేరస్థుల కన్ను తాజాగా మూసీ నిర్వాసితులపై పడింది. వాళ్లను ఆధారంగా చేసుకుని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు మాయగాళ్లు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలను డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
నిర్వాసితులకు హెచ్చరికలు : ఈ నేపథ్యంలోనే సైబర్ నేరగాళ్లు సంబంధిత సమాచారం తెలుసుకోండి అంటూ లింక్స్ పంపుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయంటూ పోలీసులకు పలువురు ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాలపై అవగాహన ఉన్న కారణంగా బాధితులు అప్రమత్తం కావడంతో సొమ్ము నష్టపోకుండా బయటపడ్డారని సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ సతీశ్‌రెడ్డి తెలిపారు. ఏపీకే ఫైల్‌లోని మాల్‌వైర్ ద్వారా మాయగాళ్లు ఫోన్‌లోకి చొరబడుతున్నారని, జాగ్రత్త వహించాలని సూచించారు.
మీ వాట్సప్‌కు వచ్చే ఏపీకే ఫైల్ లింక్ క్లిక్ చేస్తున్నారా ? - అయితే మీ బ్యాంకు ఖాతా ఖాళీ అయినట్లే
లింక్ క్లిక్ చేసి నష్టపోతున్నారు : గూగుల్ ప్లే స్టోర్‌లో లేని యాప్‌లను ఏపీకే ఫైల్స్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్నే అనువుగా మార్చుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. వాట్సాప్ నంబరుకు వచ్చే ఏపీకే ఫైల్స్‌ను క్లిక్ చేయగానే వారి కాంటాక్టు జాబితాలో ఉన్న వారందరికీ వెళ్తుంది. తెలిసిన వారి నుంచే కదా లింక్ వచ్చిందని క్లిక్ చేసి నష్టపోతున్నారు. యాప్ డౌన్‌లోడ్ అయితే ఫోన్‌ను ఫార్మాట్ చేయాలని, అనుమానాస్పద లావాదేవీలు జరిగినా, నష్టపోయినట్లు గుర్తించినా, వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
ప్రస్తుతం నగర వ్యాప్తంగా మూసీ ప్రక్షాళన నడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇలాంటి వాటికి ఈజీగా పడిపోతారనే నమ్మకంతో సైబర్ నేరగాళ్లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రజలు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారుల నుంచి ఎలాంటి సమాచారం రానంతవరకు ఇలాంటివి పక్కన పెట్టేయాలని అంటున్నారు.
వలపు వల విసురుతారు - చిక్కితే జేబు గుళ్ల చేస్తారు - ఇదొక కొత్త తరహా మోసం
మీరు ఫోన్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోవాల్సిందే - అప్పుడే మీరు సేఫ్!