Drug to Prevent Heart Attack :ఆధునిక కాలంలో మారుతున్న ఆహారపుటలవాట్లు ప్రజల ఆయుష్షును తగ్గించేస్తున్నాయి. ప్రస్తుతం మానవ జీవనశైలి ఆరోగ్యానికి చేటు చేస్తోంది. కొవిడ్ తర్వాత జీవనశైలి మార్చుకుని చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగానే డైట్, వ్యాయామం చేస్తున్నారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ మధ్య అందరినీ గుండెపోటు కలవరపాటుకు గురి చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలివాళ్ల వరకు చాలా మంది దీంతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అయితే ఇది వస్తున్న తీరును గమనిస్తే చాలా మందిలో వేకువజామునే ఎక్కువగా గుండెపోటు రావడాన్ని గమనించవచ్చు. దీన్ని నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను కనిపెట్టారు.
జలాశయాల్లో ఆడుకుందామనుకుంటున్నారా? - అయితే షికారుకు సిద్దంకండి
హార్ట్ ఎటాక్‌ను నిరోధించే కొత్త ఔషధ ఫార్ములాను బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు వి.సాయికిషోర్ నేతృత్వంలో పరిశోధక విద్యార్థులు టి.వాణీ ప్రసన్న, బి.వంశీకృష్ణ అభివృద్ధి చేశారు. వీరి ఫార్ములాకు పేటెంట్ లభించింది. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామున వస్తోంది. దాని కారకాలు వేకుమజామున విడుదల కావడమే అందుకు కారణం. అర్ధరాత్రి, వేకువజామున గుండెపోటు వస్తే ఆ సమయంలో బాధితులు వెంటనే మాత్రలు వేసుకోలేకపోతున్నారు.
గిరిజనుల్లా ఒక్కరోజైనా గడపాలనుకుంటున్నారా? - పెళ్లి కూడా చేసుకోవచ్చు!
Bapatla Pharmacy College Patent : ఈ ప్రతికూలతలను అధిగమించి, కారకాలను నిరోధించేలా ఔషధాలు రూపొందించడంపై ఆచార్యుడు సాయికిషోర్, పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ, వాణీప్రసన్న పరిశోధనలు చేశారు. ఇందుకోసం నాలుగున్నరేళ్లకు పైగా శ్రమించారు. గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయడం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. రాత్రి భోజనం తర్వాత 9గంటలకు ఈ కాప్స్యూల్ వేసుకుంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రతి నిరోధకాలను విడుదల చేసి హార్ట్ ఎటాక్‌ను సమర్థంగా అడ్డుకుంటుందని పరిశోధనల ద్వారా నిరూపించారు.
ఈ ఔషధాన్ని రెండు దశల్లో కుందేళ్లపై పరీక్షించి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. ఈ పరిశోధన పత్రం అంతర్జాతీయ రీసెర్చ్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీలో ప్రచురితమైంది. తమ ఔషధ ఫార్ములాపై పేటెంట్ హక్కు కోసం ఈ సంవత్సరం మేలో దరఖాస్తు చేసినట్లు ఆచార్యుడు సాయికిశోర్ తెలిపారు. తాజాగా కేంద్ర పేటెంట్ సంస్థ పేటెంట్ జారీ చేసిందని పేర్కొన్నారు. పేటెంట్ పొందిన బృందానికి బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ టీఈ గోపాలకృష్ణమూర్తి అభినందనలు తెలియజేశారు.
వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండెపోటు వస్తుందా? వైద్యుల మాటేంటి?