Social Service with Laddu Money : గణేశ్ లడ్డూ వేలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాలాపూర్ వినాయకుడి లడ్డూ. ఇక్కడి ప్రసాదాన్ని ఎంతకు దక్కించుకున్నారో అనేది తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా గమనిస్తుంటారు. 1994లో రూ.450తో వేలం పాట ప్రారంభం కాగా, ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించగా రూ.2,39,52,950 ఆదాయం వచ్చింది. లడ్డూ వేలంతో వచ్చిన డబ్బులతో సేవా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి తెలిపారు.
సేవా కార్యక్రమాలు : బాలాపూర్ ఉత్సవ సమితి ఇప్పటివరకు సేవా కార్యక్రమాలకు రూ. 1.58 కోట్లను వెచ్చించింది. ఇందులో రూ.65.64 లక్షలతో బాలాపూర్‌లో హనుమాన్, లక్ష్మీగణపతి, పోచమ్మ, కంఠ మహేశ్వరస్వామి మందిరాలను ఏర్పాటు చేశారు. రూ.1.55 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు, మహబూబ్‌నగర్ వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ, రూ.66.50 లక్షలతో గణేశ్ మండపానికి స్థలం కొనుగోలు, రూ. 1.45 లక్షలతో బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో షెడ్డు నిర్మించారు.
సేవలో "రిచ్"మండ్ విల్లాస్ లడ్డూ : హైదరాబాద్‌లో మరో ఫేమస్ లడ్డూ వేలం పాటలో కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ ఒకటి. బండ్లగీర్ జాగీర్‌లోని రిచ్‌మండ్ విల్లాస్‌వాసులంతా ఉన్నత విద్యావంతులు. నిరుపేదలకు అండగా నిలవాలనే సంకల్పంతో ప్రతీ అవకాశాన్నీ ఉపయోగించుకుంటున్నారు. భక్తి మార్గంలోనూ సమాజసేవకు పాటుపడుతున్నారు. ఇక్కడ 200 విల్లాలున్నాయి. గణేశ్ ఉత్సవాల సందర్భంగా లడ్డూను వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును కొన్నేళ్లుగా సమాజహిత కార్యక్రమాలకు ఉపయోగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఈసారి రాష్ట్రంలోనే లడ్డూ ధర అత్యధికంగా ఇక్కడ పలకడం విశేషం. మొదటిసారి 2016లో వేలం ద్వారా వచ్చిన రూ.25 వేల సొమ్ముతో పని మనుషుల పిల్లల చదువులకు వెచ్చించారు. తర్వాత ఆర్‌వీ దియా ఛారిటబుల్ పేరుతో ఓ సేవాసంస్థను ఏర్పాటు చేసి వేలంలో వచ్చిన డబ్బుతో పలు స్వచ్ఛంద సంస్థలకు అండగా నిలుస్తున్నారు.
వేలమూ విశేషమే : లడ్డూ వేలానికి ముందు రిచ్‌మండ్ విల్లాస్ నివాసితులను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. వేలంపాటలో అన్ని గ్రూపులు పాల్గొంటాయి. ఎక్కువ వేలంపాట పాడిన గ్రూపు లడ్డూను దక్కించుకుంటుంది. మిగిలిన మూడు గ్రూపుల సభ్యులు ఎంతవరకు వేలంపాట పాడారో ఆ డబ్బునూ అందిస్తారు. అలా వచ్చిన మొత్తాన్ని గణేశ్ లడ్డూ ధరగా నిర్ణయిస్తారు.
మొదటిసారిగా 2016లో రూ.25 వేలు పలికిన లడ్డూ ధర గతేడాది రూ.1.26 కోట్లు పలకగా ఈ సారి రూ.1.87 కోట్లకు చేరింది. ఈ డబ్బును పలు సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. దేశవ్యాప్తంగా పేదల కోసం పనిచేస్తున్న 42 స్వచ్చంధ సంస్థలకు వీరు విరాళాలు అందిస్తున్నారు. వీరు ఎంపిక చేసుకున్న వాటిలో వృద్ధాశ్రమాలు, అనాథ, చిన్నారుల విద్య కోసం పనిచేసే సంస్థలున్నాయి.