Bail to Jony Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు గురువారం బెయిల్ మంజూరైంది. జానీ మాస్టర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత నెల రోజులుగా జానీ మాస్టర్ చంచల్‌గూడ జైలులో ఉన్నారు. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీని అరెస్టు చేశారు. శుక్రవారం నాడు జానీ మాస్టర్ జైలు నుంచి విడుదలయ్యారు.
Jani Master Issue: తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని, ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని భయపెట్టాడంటూ సహాయ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నార్సింగి ఠాణాకు బదిలీ చేశారు. బాధితురాలి వాంగ్మూలం సేకరించిన పోలీసులు యువతి మైనర్‌గా ఉన్నప్పటి (2019) నుంచి లైంగిక దాడి జరుగుతున్నట్లు నిర్థారించుకుని ఎఫ్‌ఐఆర్‌లో అదనంగా పోక్సో సెక్షన్‌ను చేర్చారు.
జానీమాస్టర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం కావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడం కలకలం రేపింది. నార్సింగ్ పోలీసులు తొలుత ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మణికొండలోని నివాసానికి పోలీసులు వెళ్లి ఆరా తీయగా ఇంట్లోనూ లేరు. పనిమనిషిని ప్రశ్నించగా జానీ మాస్టర్ చెన్నై వెళ్లినట్లు చెప్పారు. కేసు నమోదైన తర్వాత సినిమా షూటింగ్‌ల కోసం నెల్లూరు, లద్దాఖ్ ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు భావించి ఆరా తీసినా ఆచూకీ మాత్రం చిక్కలేదు.
పక్కా ఆధారాలు సేకరించి అరెస్ట్ : పరారైనట్లు నిర్థారించుకున్న పోలీసులు ఆచూకీ కోసం గాలించగా గోవాలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో నిర్థారించుకున్నారు. పెద్ద హోటళ్లలో ఉంటే ఆచూకీ తెలిసిపోతుందన్న ఉద్దేశంతో జానీ మాస్టర్ ఒక చిన్నహోటల్‌లో తలదాచుకున్నాడు. పక్కా ఆధారాలు సేకరించిన రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసుల బృందం హైదరాబాద్ నుంచి గోవాకు బయల్దేరింది. అక్కడ జానీమాస్టర్‌ను అదుపులోకి తీసుకుంది. స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న పోలీసులు రోడ్డు మార్గంలో హైదరాబాద్ తీసుకువచ్చారు.
జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి - తీర్పు వాయిదా