Bail Denied to YSRCP Leaders: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. దాడి ఘటనకు సంబంధించి అరెస్టయిన ఆరు మంది వైఎస్సార్సీపీ నేతలు బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి, నిందితుల్లో ఐదుగురికి బెయిల్ నిరాకరించారు. అనారోగ్య కారణాల రీత్యా గిరి రాంబాబు అనే నిందితుడికి బెయిలు మంజారు చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 10 మందికి పైగా అరెస్టు చేశారు. అయితే కీలక నిందితులు పరారీలో ఉన్నారు. ఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో పోలీసులు తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు, పాల్గొన్నవారి వివరాలు, అసలు పాత్రధారుల విషయాలను అప్పట్లో సరిగా రికార్డు చేయలేదు. దీంతో నిందితులను గుర్తించడం, ఎవరి పాత్ర ఏమిటనేది నిర్ధారించడంపై పోలీసులు ఇప్పుడు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ భవన్పై దాడి కేసులో తీగ లాగుతున్న పోలీసులు- సూత్రధారులపైనా నజర్ - attack on NTR Bhavan
TDP Office Attack Case in Mangalagiri: కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా మొత్తం 70 మందికిపైగా దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు. ఇందులో భాగంగా పలువురు వైఎస్సార్సీపీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. 2021 అక్టోబర్లో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది.
వైఎస్సార్సీపీ కీలక నేతల ప్రమేయంపై దర్యాప్తు : కేసు విచారణ వేగవంతం కావడంతో వైఎస్సార్సీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, విజయవాడ కార్పొరేటర్ , విజయవాడ నగరపాలక వైఎస్సార్సీపీ ప్లోర్ లీడర్ తదితరులను నిందితులుగా చేర్చారు. మొత్తం ఇప్పటివరకు పలువురు వైఎస్సార్సీపీ నేతలను నిందితులుగా గుంటూరు జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రం వదిలి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
దాడిలో పాల్గొన్నవారు విజయవాడ నగరంలోని గుణదల, రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. వీరంతా వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాశ్ అనుచరులని సమాచారం. నిందితుల్లో పలువురు కార్పొరేటర్లు సైతం ఉన్నట్లు తెలిసింది. 18వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి కుమారుడు రాజా, దుర్గ గుడి పాలకమండలి సభ్యురాలు బచ్చు మాధవి, గాంధీ సహకార బ్యాంకు డైరెక్టర్ జోగరాజు, మాజీ ఉప మేయర్ చల్లారావు, తదితరులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి ప్రమేయంపై సాక్ష్యాలు సైతం ఇప్పటికే సేకరించినట్లు తెలిసింది.