Baby Kidnap in Guntur GGH : గుంటూరు జీజీహెచ్‌లో అదృశ్యమైన పసికందు కిడ్నాపర్ల నుంచి సురక్షితంగా బయటపడింది. మగశిశవును కిడ్నాప్ చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. గోరంట్లకు చెందిన నసీమా అనే బాలింత కాన్పుకోసం ఆదివారం ఆస్పత్రిలో చేరారు. అర్ధరాత్రి ఒంటి గంటకు మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు శిశువును కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
కిడ్నాప్ చేసిన శిశువును ఆటోలో తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. మొత్తం నలుగురు శిశువును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరులో వారిని అరెస్టు చేశారు. మగ శిశువును సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి తరలించారు.
4 బృందాలు ఏర్పడి గాలింపు: ఓ మహిళతో కలిసి కొందరు వ్యక్తులు బాలుడిని తీసుకుని ఆర్డీసీ బస్టాండ్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఆటో డ్రైవర్‌ను కూడా విచారించారు. మొత్తం 4 బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలించారు. కిడ్నాపర్లు చాలా తెలివిగా వ్యవహరించారని జీజీహెచ్ సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ అన్నారు. ఓ మహిళను బాలింత వేషంలో లోపలికి పంపి ఎవరికీ అనుమానం రాకుండా బాలుడిని ఎత్తుకెళ్లినట్లు వివరించారు. ఇకపై భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు.
బాపట్ల జిల్లాలో ప్రేమోన్మాది అఘాయిత్యం - అర్ధరాత్రి యువతి ఇంటికెళ్లి చాకుతో దాడి