Different Types of Mangoes and Flowers : సాధారణంగా మామిడి పండు తినాలనిపిస్తే ఏం చేస్తాం? అలా మార్కెట్లోకి వెళ్లి అక్కడ దొరికే పండ్లను కొనుక్కుంటాం. లేదా ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉంటే వాటి పండ్లను కోసుకుంటాం. కానీ మామిడి పండ్లలోనూ వివిధ రకాల రుచులు కావాలని మీ మనసు కోరుకుంటే ఏం చేస్తాం? అబ్బెే అవెక్కడ దొరుకుతాయని మనసుకు సర్దిచెప్పుకొని ఉన్న వాటితో సరిపెట్టుకుంటాం. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఆ కలను నిజం చేశారండోయ్. ఏంటి అవాక్కయ్యారా? అవును మీరు వింటున్నది నిజమే. కేవలం ఒకటి, రెండు రకాలు కాదండోయ్, ఏకంగా 15 నుంచి 20 రకాల మామిడి పండ్లను పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అది కూడా వివిధ రకాల చెట్ల నుంచి అనుకుంటే మీరు పొరపడినట్టే. ఇన్ని రకాల మామిడి పండ్లను కేవలం ఒక్క మొక్కతోనే పండిస్తున్నారు. అంతే కాదండోయ్ ఒకే మందారం చెట్టు నుంచి నచ్చిన పూల రకాలను పెంచుకునే విధంగా ప్రయోగాలు చేపట్టారు.
పచ్చి మామిడి Vs పండిన మామిడి - ఏది ఆరోగ్యానికి మంచిదో మీకు తెలుసా? - Raw Mango Vs Ripe Mango
15 నుంచి 20 రకాల మామిడి కాయలు : ఈ అరుదైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట ఐటీడీఏకు చెందిన తురాయిపువలస ఉద్యాన క్షేత్రం అధికారులు. మిక్స్‌డ్ పేరుతో అంట్లు కట్టే విధానాన్ని ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా కొన్ని రోజులుగా వీటి తయారీకి చర్యలు చేపట్టారు. ఒకే చెట్టుకు 15 నుంచి 20 రకాల మామిడి కాయలు, మందార మొక్కకు సుమారు 20 రకాల పూలు పూసేలా సిద్ధం చేస్తున్నారు.
స్థలం లేకపోయినా.. కుండీలుంటే చాలు : అవసరం మేర ఈ మొక్కలను నాటుకోవచ్చు. స్థలం లేకపోయినా పర్లేదు ఒక పెద్ద కుండీల్లోనూ పెంచుకోవచ్చు. అంటు కట్టిన మందారం మొక్క నుంచి కేవలం మూడు నెలల్లోనే నచ్చిన పూలు వస్తాయి. మామిడికి సంబంధించి రెండేళ్ల పాటు పూతను తొలగించాలని, మూడో ఏడాది నుంచి కాపునకు వదిలేయాలని ఉద్యానశాఖ అధికారి కె.కాంతారావు తెలిపారు. ప్రస్తుతం రెండేసి వేల చొప్పున తయారు చేస్తున్నామని, మరో రెండు నెలల్లో మందార మొక్కలను సరఫరా చేస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో నిమ్మ, బత్తాయిపై కూడా ప్రయోగాలు ప్రారంభించనున్నట్లు వివరించారు. సాధారణంగా రెండు మూడు రకాలతో అంట్లు నాటుతారని, కానీ తాము అత్యధికంగా 20 రకాలతో మొక్కలను తయారు చేస్తున్నామన్నారు. ఈ విధానంతో నచ్చిన పండ్లు, పూలు ఇళ్ల వద్దే అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఒక్క మామిడిపండు ధర రూ.90వేలు- రూ.లక్షల విలువైన పళ్లు దేవుడికి నైవేద్యం- ఎందుకో తెలుసా?