Availability of Teak Wood in Telangana is Decreasing : రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న గృహ నిర్మాణాల డిమాండ్‌కు అనుగుణంగా కలప లభ్యత గణనీయంగా తగ్గింది. దీంతో అవసరాలు తీర్చుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అటవీప్రాంతాలు దండిగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ ఇదే తరహా వాతావరణం నెలకొనడం ఆందోళన కలిగించే విషయం. మన వద్ద దొరికే స్థానిక కలప లభ్యత తగ్గిపోవడంతో ధర ఎక్కువగా ఉంటోంది. విదేశాల నుంచి భారీగా టేకు కర్ర దిగుమతి అవుతుండడం, ధర కొంత తక్కువగా ఉండడంతో వ్యాపారులంతా దాన్నే ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వినియోగించే టేకు కలపలో 60 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. మరికొంత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల నుంచి రాష్ట్రానికి వస్తోంది. విదేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షన్నర క్యూబిక్ మీటర్లకు పైగానే దిగుమతి అవుతుండటం గమనార్హం. ఒక నిర్మల్ జిల్లాలోనే 4 వేల క్యూబిక్ మీటర్లకు పైగా టేకు కలప అమ్ముడవుతోందంటే దాని అవసరాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
ఆయా దేశాల నుంచి కలప : సూడాన్, బ్రెజిల్, ఈక్వెడార్, శ్రీలంకతో పాటు పలు ఆఫ్రికన్ దేశాలు వివిధ రకాల కలపను భారత్‌కు కలపను ఎగుమతి చేస్తున్నాయి. సముద్రమార్గంలో కోల్‌కతా, గుజరాత్, ముంబయి, చెన్నై, విశాఖపట్నం తదితర పోర్టులకు ఓడల ద్వారా కలపను పంపిస్తున్నారు. అక్కడి నుంచి ట్రక్కులు, కంటెయినర్లు, రైళ్లు, తదితర వాహనాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. గుజరాత్‌లోని కాండ్లా పోర్టు నుంచి సమీపంలోని గాంధీధామ్‌లో ఉన్న ప్రధాన వాణిజ్య కేంద్రానికి కర్రను పంపిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మహారాష్ట్రలోని నాగ్‌పుర్, హైదరాబాద్‌లకు టేకు కలప రవాణా జరుగుతోంది.
పత్తి మాటున 'టేకు' అక్రమ రవాణా - 7 దుంగల విలువ అక్షరాలా రూ.3 లక్షలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అవసరాలను ప్రధానంగా నాగ్‌పూర్ మార్కెట్టే తీరుస్తోంది. ఇక్కడి వ్యాపారులు అవసరమైతే ఆయా దేశాలకు వెళ్లి నాణ్యతను పరిశీలించి కావాల్సిన సరకును ఆర్డర్ చేసి తీసుకుంటారు. గతంలో బర్మా (మయన్మార్) టేకు ఎక్కువగా ఉపయోగించేవారు. ప్రస్తుతం ఆ దేశం తన అవసరాల దృష్ట్యా ఎగుమతులు నిలివేయడంతో మిగతా దేశాలు ఎగుమతులను పెంచాయి.నాగ్‌పుర్ నగరంలో 300కు పైగా కలప మిల్లులున్నాయి. కోసిన చెక్కలు, ఇతర పరిమాణాల్లో పలు రాష్ట్రాలకు ఆయా దేశాల కలప పంపిస్తుంది. ఆయా ప్రాంతాల్లోని కలప డిపోల యజమానులు అక్కడి నుంచి తీసుకెళ్లి వ్యాపారం చేస్తున్నారు.
నాణ్యతలో కాస్త తేడానే : దేశీయ, విదేశీ టేకు కలప రకాల మధ్య నాణ్యతలో కాస్త తేడా ఉన్నా కొరత వల్ల విదేశీ సరకును వ్యాపారులు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులతో ఇక్కడ పెరిగే టేకు నాణ్యంగా ఉంటుంది. వీటిలో నీరు, నూనె శాతం ఎక్కువగా ఉండటంతో గట్టిగా ఉండేది. ఈ కారణంగానే టేకు కర్రకు బిగించే మొలలు, స్క్రూలు చాలాకాలం వరకు వదులు కాకుండా ఉంటాఇ. ఇవి తలుపులు, కిటికీలకు అదనపు బలాన్ని ఇస్తాయి. ఈ టేకుకు చెదల సమస్య కూడా చాలా తక్కువ. కానీ దీని లభ్యత ఇప్పుడు చాలా వరకు తగ్గింది. అడవులు ఎక్కువగా ఉన్న జిల్లాలుగా పేరొందిన ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మంతో పాటు ఇతర జిల్లాలోనూ ఇదే తరహాలో టేకు లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.
ప్రభుత్వ ఖజానా నింపిన 114ఏళ్ల నాటి టేకు చెట్టు.. ఎంత పలికిందో తెలుసా?