At Home Program in Raj bhavan Hyderabad : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై(Tamilisai) సౌందరరాజన్ అహ్వానం మేరకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సహా మంత్రులు, వివిధ పార్టీల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, రాష్ట్రంలోని ప్రముఖులు హాజరయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం, రిపబ్లిక్ డే రోజు గవర్నర్ ఆతిథ్యం ఇవ్వడం పరిపాటి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎట్ హోం కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.
ఇవాళ్టి కార్యక్రమానికి హాజరైన వారిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా ఇవాళ బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ హాజరయ్యారు. ప్రముఖుల రాకతో రాజ్‌భవన్‌లో సందడి వాతావరణం నెలకొంది. బీజేపీ నుంచి విద్యాసాగర్ రావు, మరికొందరు నేతలు వచ్చారు. బీఆర్ఎస్ నుంచి ముఖ్యనేతలెవరూ హాజరు కాలేదు. ఆపార్టీ నుంచి ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, గోరేటి వెంకన్నలు మాత్రమే వచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు - దేశభక్తిని చాటుకుంటున్న పౌరులు
Republic Day Celebrations in Telangana : గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివిధ దళాల గౌరవవందనాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకలకు హాజరయ్యారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరించినప్పుడు ప్రజలు పోరాటాల ద్వారా అధికారాన్ని నియంత్రించే శక్తి రాజ్యాంగం ఇచ్చిందని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి, హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పదేళ్లుగా పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా, నియంతృత్వ ధోరణితో వ్యవహరించడాన్ని సహించని తెలంగాణ సమాజం ఇటీవల ఎన్నికల్లో తమ తీర్పుతో చరమగీతం పాడిందని గవర్నర్ అన్నారు.
నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం : గవర్నర్