Astrologer Venu Swamy on AP Election Results : ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ మాత్రమే కాకుండా కొందరు జ్యోతిష్యులు కూడా అంచనా వేస్తుంటారు. గ్రహాల బలాలు, జాతకాలను బట్టి ఎన్నికల్లో గెలుస్తారో లేదో చెబుతుంటారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర ఎన్నికలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అంచనా వేసి చెప్పారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఏపీలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని, దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పారు. కానీ శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికే అధికారం పట్టం కట్టాయి. ఏకపక్ష విజయంతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సర్వేలన్నీ ఢంకా బజాయించాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తప్పుబడుతూ వేణుస్వామి కామెంట్స్ చేశారు.
అయితే తాజా ఫలితాల్లో రాష్ట్రంలో కూటమి విజయం సాధించటంతో తన జోస్యంపై వేణుస్వామి స్పందించారు. ఈ నేపథ్యంలో ఓ వీడియో విడుదల చేశారు. ఏపీలో జగన్ మోహన్‌రెడ్డి గెలుస్తారని భావించాననీ, ఈ విషయంలో తన లెక్క తప్పిందని అన్నారు. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించానని వీడియోలో పేర్కొన్నారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానన్న ఆయన, తాను చెప్పింది వంద శాతం తప్పని అంగీరిస్తున్నట్లు తెలిపారు.
"కేంద్రం, రాష్ట్రంలో ఎవరు గెలుస్తారనే దానిపై అంచనా ప్రకారం చెప్పాను. దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను. అది జరిగింది. ఏపీలో జగన్మోహన్‌రెడ్డి గెలుస్తారని భావించాను. అయితే ఈ విషయంలో నా లెక్క తప్పింది. నాకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి అభిప్రాయాన్ని మాత్రమే వెల్లడించాను. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పాను. ఏపీ విషయంలో నేను చెప్పింది వందశాతం తప్పని అంగీకరిస్తున్నాను." - వేణుస్వామి, ప్రముఖ జ్యోతిష్యుడు