ASHA Workers Protest in AP : తమ సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరసలు చేస్తున్నారు. రూ. 26 వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పని భారం తగ్గించి, ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏదైనా ఒక విధానాన్ని మాత్రమే అప్పగించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు కూడా 62 ఏళ్లకు పదవీ విరమణ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో ఫిబ్రవరి 8న 'చలో విజయవాడ' కార్యక్రమానికి పూనుకున్నారు. దీంతో పోలీసులు ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్భంధాలు చేస్తున్నారు.
'సీఎం జగన్ రెడ్డి మోసం చేశాడు - సమాన పనికి సమాన వేతనం హామీ అమలు ఎక్కడ?'
ASHA Workers Strike in ap : తాజాగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆశా వర్కర్లను పోలీసుు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం చలో విజయవాడ పిలుపునకు రాష్ట్ర నాయకత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇందులో పాల్గొనేందుకు ముమ్మడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల నుంచి బయలుదేరిన ఆశావర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు.
ASHA workers Chalo Vijayawada program : పోలీసులు అదుపులో ఉన్న ఆశా వర్కర్లకు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు సంఘీభావం తెలిపారు. మంగళవారం రాత్రి నుండి మా ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని, కనీసం బయటికి రాకుండా అడ్డుకుంటున్నారని ఆశా కార్యాకర్తలు వాపోయారు. విధి నిర్వహణలో ఉన్న తమను అన్యాయంగా పోలీసు స్టేషన్లకు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల 36 గంటల నిరసన దీక్ష- కలెక్టరేట్ ముట్టడికి యత్నం
తమ సమస్యలను పరిష్కరించాలంటూ చలో విజయవాడకు కార్యక్రమానికి వెళ్తున్న ఆశా కార్యకర్తలను అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం వద్ద పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారు. ఊబలంక పీహెచ్సీ వద్ద సమావేశం ఉందని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి ఆశా కార్యకర్తలను బలవంతంగా బస్సులో ఎక్కించి గోపాలపురంలోని కళ్యాణమండపం వద్దకు తీసుకెళ్లి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అక్కడకు చేరుకుని వారికి మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునేందుకు విజయవాడ వెళ్తున్న కార్యకర్తలను అరెస్టు చేయటం దారుణమన్నారు.
ASHA Workers arrests in AP : అదేవిధంగా డిమాండ్ల సాధన కోసం అనకాపల్లి జిల్లా నుంచి విజయవాడకు పెద్దఎత్తున వెళ్తున్న ఆశా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడా నిర్బంధించారు. అలాగే మరికొందరిని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలను పోలీసులు అడ్డుకోడాన్ని సీఐటీయూ నాయకులు తీవ్రంగా ఖండించారు.