Araku Coffee Second Cafe in Paris : మన్యం పేరు చెప్పగానే మనకు రెండు విషయాలు స్పురణకు వస్తాయి. ఒకటి అరకు అందాలు, ఇరుకైన ప్రయాణ మార్గాలు. వెళ్లినవారెవరైనా ఆ ప్రకృతికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతి మది పులకరించాల్సిందే. అంతలా అక్కడి అందాలు కనువిందు చేస్తూ అందరినీ కట్టిపడేస్తాయి. మరొకటి కమ్మని అరకు కాఫీ. ఘుమఘుమలాడే దీని సువాసనకు మనసు మైమరచిపోతుంది. ఈ కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కిన విషయం తెలిసిందే.
Araku Coffee in Paris : తాజాగా ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పారిస్‌కు వచ్చే క్రీడాకారులు, అతిథులు అరకు కాఫీని రుచి చూడనున్నారు. పారిస్‌లో 2017లో అరకు కాఫీ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే మరో ఔట్‌లెట్‌ను తెరవాలనుకుంటున్నట్లు ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ప్రకటించారు. 2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూరస్- 2018 పోటీల్లో అరకు కాఫీకి బంగారు పతకం లభించింది.
PM Modi About Araku Coffee : మరోవైపు అరకు కాఫీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా ప్రమోట్ చేశారు. ఇటీవల మన్యం కాఫీ రుచిని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. గతంలో సీఎం చంద్రబాబుతో కలసి జీ-20 సదస్సులో ప్రధాని మోదీ అరకు కాఫీని రుచిచూశానని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన చంద్రబాబు వీలైతే మరోకప్పు మీతో కలసి కాఫీ తాగాలని ఉందంటూ రీట్వీట్ చేశారు.
దేశం మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ఏపీ ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్ చాలా ఎక్కువ. సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. ఈ కాఫీ గింజలను, ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తుంది. అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తుంది. మరికొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది.