APSRTC Special Buses for Dussehra : దసరా ఉత్సవాలను దృష్టిలో పెట్టుకోని ఆర్టీసీ సిద్ధమవుతోంది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్లుగా బస్సు సర్వీసులు నడిపేందుకు సంస్థ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల 3 నుంచి 12 వరకు (అక్టోబర్ 3 -12) జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇదే సమయంలో స్కూల్, కళాశాలలకు పండగ సెలవులు ఉన్నందున తమ ఊళ్లోకు వెళ్లే ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. దీంతో పండగకు ఉండే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అక్టోబర్ 3 నుంచి 15 వరకు 13 రోజులపాటు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.
విజయవాడ - హైదరాబాద్ అత్యధికం : ఈ సంవత్సరం అన్ని మార్గాల్లో కంటే హైదరాబాద్‌కు అత్యధికంగా 353 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ మార్గంలోనే ప్రయాణికులు ప్రయాణించడానికి ఎక్కువ డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో విద్య, ఉద్యోగాల నిమిత్తం ఉంటున్న పలు జిల్లావాసుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నాన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత రాజమహేంద్రవరం రూట్‌కి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
తొలి మూడు రోజులు 37 సర్వీసులు చొప్పున నడుపుతారని అధికారులు పేర్కొన్నారు. మూలా నక్షత్రమైన అక్టోబర్ 9న అమ్మవారి దర్శనానికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. ఈ క్రమంలోనే ముందు రోజు (అక్టోబర్ 8న) నుంచి బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 9న 105 బస్సులు, 10వ తేదీన 117 బస్సులు, 11న 128 బస్సులు ప్రత్యేకంగా తిప్పనున్నారు. పండగ తర్వాత రోజు ఆదివారం (అక్టోబర్ 13) రావడంతో 13న 128 బస్సులు, 14న 103 బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయానికి వచ్చారు.
గత ఏడాది రూ. 2.35 కోట్ల ఆదాయం : 2023లో దసరా ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.2.35 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. మొత్తం 959 ప్రత్యేక బస్సులు 5.30 లక్షల కిలోమీటర్లు మేర తిప్పారని తెలియజేశారు. కిలోమీటర్లుకు రూ.44.36 మేర ఆదాయం వచ్చిందని తెలిపారు. ఓఆర్ 66% నమోదైనట్లు వెల్లడించారు. హైదరాబాద్ - విజయవాడ రూట్లో నడిచిన సర్వీసుల ద్వారా గరిష్ఠంగా రూ.1.08 కోట్ల ఆదాయం దక్కిందని వివరించారు. ఆ తర్వాత విశాఖపట్నం మార్గంలో రూ.75.52 లక్షల మేర ఆదాయం వచ్చిందని తెలియజేశారు. 2021లో 1.45 కోట్లు రూపాయలు, 2022లో 2.10 కోట్లు రూపాయలు ప్రత్యేక సర్వీసుల ద్వారా ఆర్టీసీకి సమకూరింది.