APSFL Proposals for BharatNet Project Expansion: ఆంధ్రప్రదేశ్‌లో భారత్‌నెట్ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని ఏపీ మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్‌ను ఏపీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కార్యదర్శి సురేశ్‌కుమార్, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ కె. దినేష్‌కుమార్‌లు కలిసి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో భారత్ నెట్ ప్రాజెక్టు అమలుపై కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు నివేదిక సమర్పించారు. భారత్ నెట్ ప్రాజెక్టును మరింత విస్తృతంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అందించాలని సురేష్ కుమార్ కోరారు. భారత్ నెట్ సమర్ద వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ (Customer Premise(s) Equipment) బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన 650 కోట్ల రూపాయలు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు.
ఏపీ ఎస్ఎఫ్ఎల్ (Andhra Pradesh State FiberNet Limited) ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాండ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అందులో 5 లక్షల కనెక్షన్లు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా 6 వేల 200 పాఠశాలలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 11 వేల 254 గ్రామ పంచాయతీలు, 5 వేల 800 రైతు కేంద్రాలకు, 9 వేల 104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నట్టు కేంద్రానికి ప్రభుత్వం వివరించింది. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు.