APPSC Group-2 Mains Exam Postponed : ఈ నెల 28న ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో వాయిదా (AP Group 2 Mains Postponed) వేసినట్లు ప్రభుత్వం తెలిపింది. పరీక్ష తేదీని త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది.
Candidates Request Postpone of APPSC Group 2 Mains Exam: వచ్చే నెల 28న నిర్వహించబోయే గ్రూప్-2 మెయిన్స్ వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి గతంలో డిమాండ్లు వెల్లువెత్తాయి. సిలబస్‌లో మార్పులు చేయడం ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ పరీక్షకు మరికొంత సమయం పెంచాలంటూ పలువురు ఆందోళనలు చేపట్టారు. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలంటూ పలువురు ప్రజాప్రతినిధులు సైతం విజ్ఞప్తి చేశారు.
గత వైఎస్సార్సీపీ సర్కార్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం లక్షలాది మంది ఐదేళ్లపాటు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఖాళీగా ఉన్న వేలాది పోస్టులను భర్తీ చేయాలంటూ ఎన్నోసార్లు రోడ్డెక్కినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ఎక్కడ ఓట్లు పోతాయనే భయంతో ఎన్నికల ముందు హడావుడిగా గతేడాది డిసెంబర్ 7న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టి కేవలం 897 పోస్టుల భర్తీకి మాత్రమే ఏపీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. గతంలో ఉన్న సిలబస్‌లో మార్పులు చేసి నూతన సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆగమేఘాలపై నియామక ప్రక్రియ చేపట్టింది.
కేవలం 2 నెలలు వ్యవధిలోనే ఫిబ్రవరి 25నే గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. 4,83,535 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా ప్రిలిమ్స్‌కు 4,04,037 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సరిగ్గా సిద్ధం కాలేకపోవడంతో ఏకంగా 79,498 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. ఏప్రిల్ 10న గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసిన ఏపీపీఎస్సీ 92,250 మంది మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు తెలిపింది. సరిపడా సమయం లేక సరిగా ప్రిపేర్ కాలేదని ప్రభుత్వ నిర్వాకంతో తమ కల చెదిరిందంటూ వైఎస్సార్సీపీ సర్కార్‌ను గద్దె దింపడంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారు.