APPSC Chairman Gautam Sawang Comments: 2018 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో లిటిగేషన్లు సహజమని, గతంలోనూ ఇలాంటివి జరిగాయన్నారు. హైకోర్టు ఇచ్చిన కోర్టు ఆర్డర్ కాపీని చదివామని, సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు తమకు చాలా అవకాశాలున్నాయన్నారు.
ఏపీపీఎస్సీపై వచ్చిన ఆరోపణలన్నింటికీ స్పష్టత ఇస్తామన్నారు. ఏపీపీఎస్సీపై మాయని మచ్చ పడిందని తాను అనుకోవడం లేదన్నారు. ఎంపికై ఉద్యోగాలు చేస్తోన్న 162 ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి న్యాయం జరిగేలా ప్రయత్నాలు చేస్తామన్నారు. అంతా సవ్యంగానే జరిగిందని, ఎటువంటి తప్పు జరగలేదని అన్నారు. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను ఒకేసారి మాన్యువల్ వ్యాల్యువేషన్ చేశామని, రెండో సారి జరగలేదని గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆరోపణలు చేయాలంటే చాలా చేయచ్చొని, ప్రతి దశలోనూ లిటిగేషన్లు వచ్చాయని, అయినా సరే వాటిని ఎదుర్కొన్నామన్నారు.
2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం పకడ్బందీగా జరిగిందని గౌతమ్ సవాంగ్ చెప్పారు. 162 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు 55 రోజులు క్యాంపులో కూర్చుని వ్యాల్యువేషన్ చేశారని, వ్యాల్యువేషన్ ప్రక్రియ అంతా సీసీ కెమెరాలో రికార్డు చేసినట్లు తెలిపారు. నియామకాలకు సంబంధించి అన్ని ఆధారాలూ ఏపీపీఎస్సీ వద్ద ఉన్నాయన్నారు. నియామకాల్లో ఏపీపీఎస్సీ చాలా పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని తెలిపారు.
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు - ఏపీ హైకోర్టు కీలక తీర్పు
APPSC Group 1 Prelims Exam 2024: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, ఈ సారి అత్యధికంగా లక్షా 48 వేల 881 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. 18 జిల్లాలో 301 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని, ఇవాళ్టి ఉదయం పరీక్షలో 72.3 హాజరు నమోదైందని చెప్పారు. 6145 కెమెరాలతో, సీసీ టీవీ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నామన్నారు. అదే విధంగా రికార్డింగ్ కూడా ఉంటుందని అన్నారు.
6 వేల 600 మందికి పైగా ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పేపర్-2 పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 301 కేంద్రాలు ఏర్పాటు చేశామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరుగుతుందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. పరీక్షకు సంబంధించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పకడ్బందీగా జరుపుతున్నామన్నారు.
ఆరు నెలల్లో మళ్లీ గ్రూప్-1 మెయిన్స్ - మూల్యాంకనం నిష్పాక్షికంగా జరగలేదన్న హైకోర్టు