AP Police Weekly Off System: అధికారమే పరమావధిగా ఎడాపెడా హామీలు గుప్పించిన జగన్, వాటిని నెరవేరుస్తానంటూ గత ఎన్నికల ముందు మేనిఫెస్టో తెచ్చారు. అధికారంలోకి వచ్చాక మాత్రం అన్ని వర్గాల వారికీ నమ్మక ద్రోహం చేశారు. జగన్‌ను నమ్మి మోసపోయిన వారిలో పోలీసులూ ఉన్నారు. వారాంతపు సెలవుపై పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన మాటను వారంతా విశ్వసించారు. అయితే వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు నటించిన వైసీపీ ప్రభుత్వం, వారానికి ఒక రోజు సెలవు కల్పించేలా 2019 జూన్ 19 నుంచి ‘‘వీక్లీ ఆఫ్’’ను అమల్లోకి తెచ్చింది. తమకిచ్చిన హామీ నెరవేర్చారంటూ పోలీసులు జగన్‌కు సన్మానాలు, సత్కారాలు చేశారు. అప్పటికి జగన్మోసాన్ని తెలుసుకోలేకపోయారు.
పోలీసులకు వారాంతపు సెలవుపై 2019 అక్టోబర్ 21 సీఎం జగన్ గొప్పలు చెప్పారు. దేశంలోనే తొలిసారి తామే అమలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మొదట్లో నాలుగైదు నెలల ఈ విధానం సక్రమంగానే అమలైంది. 2020 మార్చిలో కొవిడ్ పరిస్థితులు, లాక్‌డౌన్ కారణంగా ‘‘వీక్లీ ఆఫ్’’ల విధానం మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
99 శాతం హామీలు ఎలా పూర్తయ్యాయి జగన్? - ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటి? - YSRCP Fake Manifesto
అనంతరం 2020 అక్టోబర్ 21న సీఎం జగన్ మాట ఉద్యోగాల భర్తీపైకి వెళ్లింది. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేసిన తర్వాత వీక్లీ ఆఫ్ విధానాన్ని అమలు చేస్తామంటూ జగన్ చెప్పుకొచ్చారు. ఎందుకంటే పోలీసులకు వారంతపు సెలవు విధానం అమలుకావాలంటే ఖాళీగా ఉన్న 12 వేల 384 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని, రవిశంకర్ అయ్యన్నార్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. కానీ జగన్ పాలనలో 411 ఎస్సై ఉద్యోగాలు మినహా ఒక్క పోలీసు కానిస్టేబుల్ పోస్టూ భర్తీ కాలేదు.
అదే విధంగా 2021 అక్టోబర్ 21 సీఎం జగన్ పోలీసుల వారంతపు సెలవుపై మళ్లీ పాత పాటే పాడారు. కరోనాను బూచిగా చూపారు. మళ్లీ ఈ రోజు నుంచి అమలు చేస్తున్నామంటూ ఆరోజు చెప్పారు కానీ ఆయన మాట ఒట్టి బూటకమేనని తేలిపోయింది. ఎందుకంటే మరో ఏడాది గడిచిపోయింది కానీ పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమల్లోకి రాలేదు.
2022 అక్టోబర్ 21 నాటికి కొత్త డీజీపీ, కొత్త హోంమంత్రి వచ్చారు కానీ, వీక్లీ ఆఫ్ విధానం మాత్రం పట్టాలెక్కలేదు. అలాగని పోలీసు ఉద్యోగులూ ఏమైనా భర్తీ చేశారా అంటే అదీ లేదు. పోలీసులు ఖాళీలు భర్తీ కాక సిబ్బందిపై అదనపు పనిభారం పడింది. ఒత్తిడి రెండింతలు పెరిగింది. గతేడాది పోలీసు అమల వీరుల సంస్మరణ వేళ, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశాక అమలు చేస్తామని మరోసారి చెప్పిందే చెప్పారు. అయితే ఇవేమీ సాకారం కాలేదు. కేవలం అమల వీరుల సంస్మరణ రోజున మాట్లాడటం తప్పించి, కనీసం సమీక్ష కూడా సీఎం చేయలేదు.
ఐదేళ్ల పదవీ కాలంలో ప్రతిపక్ష నేతలు, తనకు ఇష్టం లేని వారిపై అదేపనిగా పోలీసులను జగన్ ప్రయోగించారు. ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రతిపక్ష నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులను, టీచర్లను గృహ నిర్బంధాలు చేయించారు. నిత్యం పోలీసులను రోడ్డెక్కించారు. పోలీసులను పార్టీ ప్రయోజనాల కోసమూ గట్టిగా వాడుకున్న జగన్, వారికి వారాంతపు సెలవుపై ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారు.
సీఎం జగన్ 'బాటా రేట్' వ్యూహం - 99 శాతం హామీల వెనక అసలు కథ ఏంటంటే !