AP Police Conduct Cordon Search Operation Across the State : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్బంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీల నేతృత్వంలో ముఖ్యమైన ప్రాంతాలు, కూడళ్లు, గ్రామశివార్లలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. అనుమానిత వ్యక్తులు, పాతనేరస్తులు, దుకాణాలు, అక్రమమద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలను గుర్తించేందుకు వీలుగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
మే 27వ తేదీ నుంచి ఈరోజు వరకూ 579 ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని స్పష్టం చేశారు. 3524 పత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలో వివరించారు. ఇప్పటి వరకూ 16 మంది అనుమానితుల ఆరెస్టు చేశామని వెల్లడించారు. అలాగే 307 లీటర్ల మద్యం, 1400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశామని డీజీపీ తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన రోజే ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ - Government Orders on ABV Posting
ఆ రోజు నుంచి హోటళ్లు, దుకాణాలు బంద్ : కౌంటింగ్ రోజున బాపట్ల జిల్లాలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. భద్రతను సమీక్షించేందుకు ఈరోజు జిల్లా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూన్ 3న సాయంత్రం నుంచి జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బాపట్ల, అద్దంకి, చీరాల, రేపల్లె ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని వెల్లడించారు. జిల్లాలో 5 డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు రోజు అల్లర్లకు పాల్పడినవారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. జూన్ 3న సాయంత్రం నుంచి హోటళ్లు, దుకాణాలు మూసివేయలన్నారు. కౌంటింగ్ ముగిసే వరకు దుకాణాలు తెరవడానికి వీలు లేదని ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టం చేశారు.
కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధం : ఓట్ల లెక్కింపు సందర్బంగా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టామని తిరుపతి ఎస్పీ హర్షవర్థన్ రాజు తెలిపారు. పోలింగ్ అనంతరం తిరుపతిలో చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆరు కంపెనీల కేంద్ర బలగాలు, 2540 మంది రాష్ట్ర పోలీసులతో కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కౌంటింగ్ సెంటర్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్, 30యాక్ట్ అమలులో ఉంటుందని, ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. కౌంటింగ్ రోజున అవాంచనీయ సంఘటనలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్ కేంద్రం చేరుకొనే మార్గంలో 25 తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజున విజయోత్సవ ర్యాలీలు నిషేధం ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకురాకూడదన్నారు. కూచువారి పల్లి, పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద దాడుల్లో పాల్గొన్న 57 మంది పై రౌడీ షీట్ ఓపెన్ చేశామన్నారు. 620 మందిపై బైండోవర్లు పెట్టామన్నారు.
ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ : శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో డీఎస్పీ వాసుదేవన్ ఆధ్వర్యంలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు. వాస్తవాన్ని తలపించే విధంగా అల్లరి మూకలు రాళ్లు విసురుతున్నట్లు, పోలీసులు లాఠీ చార్జ్‌లు, కాల్పులు జరిపినట్లు నిర్వహించారు. కాల్పులు జరిగినప్పుడు గాయపడిన వ్యక్తులను పోలీసులు స్ట్రక్చర్‌పై మోసుకొని తీసుకు వెళ్లడం వంటి దృశ్యాలు ప్రజలను ఆలోచింపజేశాయి.
ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం - సిబ్బందికి అధికారుల సూచనలు - Votes Counting Process