AP Ministers Lokesh And Nimmala Visit Budameru : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా నందివాడ మండలంలో బుడమేరుకు మళ్లీ క్రమంగా వరద పెరుగుతోంది. మంగళవారం సుమారు వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగగా బుధవారం ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో అడుగు పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికే మొదటి గండిని పూడ్చారు. మరో 2 గండ్లు పూడ్చేలా పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో పనులకు ఆటకం కలుగుతోంది. ఏపీ మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో వారు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. గత ఐదు సంవత్సరాలలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడటానికి ప్రధాన కారణమని అధికారులు ఏపీ మంత్రులకు వివరించారు. 200 మీటర్ల వెడల్పున మూడు గండ్లు ఏర్పడ్డాయని అధికారులు లోకేశ్‌కు వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
మళ్లీ పెరుగుతున్న వరద ప్రవాహం : మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నారా లోకేశ్ నిమ్మల రామానాయుడిని కోరారు. క్షేత్రస్థాయిలోనే ఉండి గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బోట్ల ద్వారా పంపు ప్రాంతాల ప్రజలను అధికారులు ఒడ్డుకు చేరుస్తున్నారు.
3 వేల మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఇప్పటికే వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. పలు చోట్ల చేపలు చెరువులకు గండ్లు పడ్డాయి. గత 30 సంవత్సరాలలో బుడమేరు ఎన్నడూ ఇంతటి ఉద్ధృతంగా ప్రవహించలేదని ముంపు ప్రాంతాల ప్రజలు అంటున్నారు. పుట్టగుంటలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా వరద నీరు చేరింది. అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.
మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం - పార్వతి బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద - Flood Inflow To Parvati Barrage