New Judgment of AP High Court : వివాహమైనా, కాకున్నా కుమారుడితో పాటు కుమార్తె కూడా ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో ఎప్పటికీ భాగమేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యతను ఆమె నుంచి దూరం చేయడానికి వీల్లేదని తెలిపింది. కారుణ్య నియామక వ్యవహారంలో పెళ్లైన కుమారుడి విషయంలో లేని అనర్హత, కుమార్తె విషయంలో చూపడం వివక్షేనని పేర్కొంది. పెళ్లయిందన్న కారణంతో కుమార్తెను ఆమె తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాదనడం దుర్మార్గమని వ్యాఖ్యానించింది. వెంటనే పిటిషనర్‌కు తగిన ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు తీర్పు ఇచ్చారు.
అసలేం జరిగిందంటే : ఏపీలోని విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో స్వీపర్‌గా పని చేసే వి.జగదీశ్ 2013లో మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు మోహన, సిరిపల్లి అమ్ములు. అమ్ములు తండ్రి నిర్వహించిన స్వీపర్/తగిన పోస్టును కారుణ్య నియామకం కింద తనకు ఇవ్వాలని దేవస్థానం అప్పటి ఈవోకు వినతిపత్రం ఇచ్చింది. దీంతో కోర్టు నుంచి విడాకుల పత్రాన్ని తీసుకురావాలని ఈవో సూచించారు. దీనికి ఆమె మరో వినతిపత్రాన్ని ఇచ్చారు. తన భర్త ఎక్కడున్నారో తెలియడం లేదని, తండ్రి స్వీపర్ పోస్టును తనకు ఇవ్వాలని ఈవోతో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్‌కు సైతం విన్నవించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో 2021లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో వాదనలు వినిపించిన దేవాదాయ కమిషనర్ తరఫు న్యాయవాది తన తండ్రి కన్నుమూసే నాటికి ఆయనపై ఆధారపడి జీవిస్తున్నానని చెప్పేందుకు ఆధారాలను పిటిషనర్ సమర్పించలేదని తెలిపారు. ఆమెకు వివాహం అయిందని, భర్తతోనే నివసిస్తోందన్నారు. తండ్రితో కలిసి జీవించడం లేదని చెప్పారు. పిటిషనర్ విడాకులు తీసుకున్నానని చెబుతున్నారు. కానీ అందుకు సంబంధించిన విడాకుల పత్రాన్ని మాత్రం చూపడం లేదన్నారు. అందువల్లే 2018లో పిటిషన్ అభ్యర్థనను తిరస్కరించినట్లు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
అలాగే పిటిషనర్‌కు, ఆమె సోదరికి తండ్రి బతికుండగానే వివాహం అయిందని హైకోర్టుకు తెలిపారు. తన భర్త 2020 డిసెంబర్లో కన్నుమూశారని ధ్రువపత్రం సమర్పించారు. అంటే 2013లో తండ్రి మరణించే నాటికి పిటిషనర్ ఆయనపై ఆధారపడి జీవించడం లేదని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. ఈ క్రమంలో అమ్ములు తరఫు వాదనలను డి.వి.శశిధర్ వినిపించారు. 1999లో ప్రభుత్వం జారీ చేసిన జీవో 350 ప్రకారం వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని తేల్చి చెప్పారు. పిటిషనర్ భర్త సైతం మరణించారని హైకోర్టుకు తెలిపారు. దీంతో పిటిషనర్‌కు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పించాలని హైకోర్టును కోరారు.
షరతులు విధించడం చట్టవిరుద్ధం : ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి వివక్ష చూపేలా షరతులు విధించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఆ జీవో, సర్క్యూలర్లను పరిశీలిస్తే వివిధ షరతులకు లోబడి వివాహిత కుమార్తె కారుణ్య నియామకానికి అర్హురాలేనని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. కారుణ్య నియామక పథకం ముఖ్యోద్దేశం ఏంటంటే మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పించడమేనని చెప్పారు. ఈ పథకం అమలులో వివాహమైన కుమారుడికి లేని అనర్హత, వివాహమైన కుమార్తె విషయంలో చూపడం వివక్షేనని స్పష్టం చేశారు. ఈ క్రమంలో అమ్ములకు 8 వారాల్లోగా ఉద్యోగమివ్వాలని అధికారులను ఆదేశించారు. పిటిషనర్ తండ్రి చనిపోయిన తేదీ నుంచి సర్వీస్ ప్రయోజనాలు కల్పించాలని, కానీ ఈ కాలానికి ఆర్థిక ప్రయోజనం పొందేందుకు మాత్రం పిటిషనర్ అనర్హులని న్యాయమూర్తి స్పష్టత ఇచ్చారు.
''మరణ వాంగ్మూలం ఆధారంగా యావజ్జీవ శిక్ష విధించవచ్చు - ఆ తీర్పు సబబే' - TG HC on Life Sentence