AP HC on Pinnelli Bail Petitions : వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను నిర్ణయం ప్రకటించేంతవరకు పొడిగించింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసులను పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై గురువారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.
Pinnelli Bail Petitions Updates : పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పోలీసులు నమోదు చేసిన నాలుగు కేసుల్లో రెండు ఏడేళ్లలోపు జైలు శిక్ష పడేందుకు వీలున్నాయని హైకోర్టుకు తెలిపారు. వాటిలో 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. మరో రెండు కేసులు ఐపీసీ సెక్షన్ 307(హత్యాయత్నం)కింద నమోదు చేశారని చెప్పారు. ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియోలో ఉన్నది పిన్నెల్లి అనేందుకు సాంకేతిక ఆధారాలు లేవని న్యాయస్థానానికి వివరించారు. నేరఘటనల్లో పాల్గొన్నారనేందుకు సాక్ష్యాలు లేవని, అందుకే ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు.
పోలీసుల తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. వీడియోను పరిశీలించాక ఈవీఎంను ధ్వంసం చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అని ఎన్నికల సంఘం తేల్చిందని హైకోర్టుకు వివరించారు. ఈవీఎంను బద్దలుకొట్టి ఓటర్లను భయబ్రాంతులను చేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లోను పిటిషనర్ హింసా ఘటనలకు పాల్పడ్డారని న్యాయస్థానానికి తెలిపారు.
EX MLA Pinnelli Case Updates : తాజా ఎన్నికల్లోనూ పిటిషనర్ నేరాలను పునరావృతం చేశారని అశ్వనీకుమార్ హైకోర్టుకు వివరించారు. అరెస్ట్ నుంచి రక్షణ ఇస్తూ ధర్మాసనం విధించిన షరతులను ఉల్లంఘించారని, సాక్షులను బెదిరించారని అన్నారు. పిటిషనర్ పూర్వ నేర చరిత్రను దృష్టిలో పెట్టుకొని ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని అశ్వనీకుమార్ న్యాయస్థానాన్ని కోరారు.
పిన్నెలి దాడి బాధితుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ ఈవీఎం ధ్వంసం తర్వాత భయపడిపోయిన అధికారులు పిటిషనర్‌పై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని హైకోర్టుకు తెలిపారు. సిట్ ఏర్పాటు తర్వాత బాధితులు ధైర్యంగా ముందుకొచ్చారన్నారు. పిన్నెల్లి దగ్గరుండి ప్రోద్భలం చేయడంతో పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారని న్యాయస్థానానికి చెప్పారు.
తీవ్ర నేరాలకు పాల్పడిన పిటిషనర్‌కు బెయిల్ మంజూరు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని పోసాని వెంకటేశ్వర్లు హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ పొందేందుకు అనర్హులన్నారు. పిన్నెల్లి వ్యవహార శైలి, నేర తీవ్రత, సమాజంపై చూపే ప్రభావం, నేర చరిత్రను దృష్టిలో ఉంచుకొని ఆ పిటిషన్లను కొట్టేయాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
పిన్నెల్లి బెయిల్ 13వరకు పొడిగింపు- హైకోర్టులో విచారణ వాయిదా - PINNELLI ANTICIPATORY BAIL