Srisailam Temple Lands Issue : శ్రీశైలం దేవస్థానానికి చెందిన తొమ్మిదెకరాల విస్తీర్ణంలోని ఏనుగుల చెరువు స్థలంలో నిర్మాణంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆ చెరువు భూమిలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం, ల్యాడ్‌స్కేప్ ఏర్పాటు కోసం వీబీ టెక్నోక్రాప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అధికారులు భూమిని కేటాయించారని పేర్కొంటూ అఖిల భారత వీరశైవ ధార్మిక ఆగమ పరిషత్ ఛైర్మన్ సంగాల సాగర్, మరొకరు 2020లో హైకోర్టులో పిల్ వేశారు.
Private Trust Temple Issue in Srisailam : వీబీ టెక్నో అధికారుల్ని ఆశ్రయించగా భూమిని కేటాయించారని ఆ వాజ్యంలో తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం ఫౌండర్ ట్రస్ట్, ఛైర్మన్‌గా ఉన్న సేనాని సుబ్రహ్మణ్యస్వామి ట్రస్ట్‌తో, వీబీ టెక్నోక్రాప్ట్స్ దేవాలయం నిర్మాణానికి ఒప్పందం చేసుకుందని అందులో వివరించారు. ఈ పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీ సతీశ్ వాదనలు వినిపించారు.
చారిత్రాత్మక ఏనుగుల చెరువును ఇతర నిర్మాణాలకు అనుమతించడం చట్ట విరుద్ధమని హైకోర్టుకు పిటిషనర్ తెలిపారు. ఆ చెరువు వల్ల మల్లిఖార్జున స్వామి దేవాలయంలోని నాలుగు పవిత్ర బావులకు నీరు పుష్కలంగా వస్తుందని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి ఆ భూమితోపాటు మొత్తం 28 ఎకరాలు కేటాయించారని న్యాయస్థానానికి వివరించారు. విరాళాలను సేకరించి దేవాలయాన్ని ఏర్పాటు చేయాలని ట్రస్ట్ భావిస్తోందని పేర్కొన్నారు.
ట్రస్ట్ పేరున ప్రైవేట్ ఆలయం? : ఇలా ఆలయాన్ని నిర్మించి సొంతంగా వారే నిర్వహించాలని చూస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం అప్పటి ఈఓ తీరుపై సందేహాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం ఫౌండర్ ట్రస్ట్, ఛైర్మన్‌గా ఉన్న సేనాని సుబ్రహ్మణ్యస్వామి ట్రస్ట్ పేరున గుడి నిర్మాణానికి ఈఓ సహకారం అందించినట్లు ఉందని తెలిపింది. శ్రీశైలం దేవస్థానానికి సమాంతరంగా ట్రస్ట్ పేరుతో ప్రైవేట్ ఆలయాన్ని నిర్మించాలని చూస్తున్నట్లు ఉందని ధర్మాసనం తెలిపింది.
ఈ మొత్తం వ్యవహారంపై దృష్టిపెట్టాలని రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. పూర్తి వివరాలతో మొరుగైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 18కి వాయిదా వేసింది. గతంలో 2020 అక్టోబర్‌లో ఈ వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపిన విషయ తెలిసిందే. తొమ్మిదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఏనుగుల చెరువు స్వభావాన్ని మార్చొద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఆ భూమి మాదంటే మాదే అంటున్న శ్రీశైలం దేవస్థానం- అటవీశాఖ అధికారులు! - Srisailam Temple Land Disputes