Injection for Heart Attack Patients: ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గుండె సంబంధిత వ్యాధులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకప్పుడు కాస్త వయసు పైబడినవారిలో ఈ సమస్య తలెత్తేది. అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ సంభవిస్తోంది. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తొలిగంటలో ఓ అత్యవసర ఇంజక్షన్ ఇస్తే రోగి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అయితే అది కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారం.
ఇంజక్షన్ అందుబాటులో లేకపోవటం, ఆర్థిక సమస్యల కారణంగా సరైన సమయంలో వైద్యం అందక గుండెపోటుతో మరణించినవారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి గుండెనొప్పి రోగులకు సాంత్వన చేకూరేలా చర్యలు చేపట్టింది. హబ్ అండ్ స్పోక్ విధానంలో సేవల విస్తరణ ద్వారా ఖరీదైన ఇంజక్షన్‌ను అవసరమైన రోగులకు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏమిటీ విధానం? దీనివల్ల లాభాలేంటి? ఎప్పుడు ప్రారంభిస్తున్నారు? వంటి వివరాలు మీకోసం.
ఏమిటీ హబ్ అండ్ స్పోక్ విధానం:
- రాష్ట్రంలోని పూర్వ ప్రభుత్వ వైద్య కళాశాలలు అన్నింట్లో టెలిసెంటర్లను ఏర్పాటుచేశారు. వీటినే హబ్స్ అంటున్నారు. కొన్ని ఎంపిక చేసిన సీహెచ్‌సీ, ఏరియా, జిల్లా ఆసుపత్రులను వీటికి అనుసంధానం చేశారు. వాటినే స్పోక్స్ అంటారు.
- ఎవరికైనా గుండెనొప్పి వచ్చినప్పుడు దగ్గర్లో ఉన్న చిన్న ఆస్పత్రులైన స్పోక్స్‌కు వెళ్తే.. అక్కడి వైద్యులు వారికి ఈసీజీ తీస్తారు.
- రోగుల వివరాలు, వారి సమస్యను పెద్ద ఆస్పత్రికి (హబ్) పంపుతారు. వాటిని పరిశీలించే ఉన్నత వైద్యనిపుణులు.. ఆయా రోగులకు ఇంజక్షన్ అవసరమో కాదో చెబుతారు.
- దాన్ని బట్టి అవసరమైనవారికి వెంటనే చిన్న ఆస్పత్రి వైద్యులే టెనెక్ట్‌ప్లేస్ ఇంజక్షన్ ఇస్తారు.
- ఇప్పటివరకు 15,077 మంది రోగులను పరీక్షించగా.. వారిలో 6,508 మందికి గుండె సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.
- అందులో 840 మందికి ఇంజక్షన్ ఇచ్చి, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేశారు.
- ఈ విధానంలో అత్యవసర చికిత్సతో రోగులు ప్రయోజనం పొందుతారని, మిగిలినవారికీ సరైన వైద్యం అందుతుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు.
ఈ విధానం వల్ల లాభాలేంటి?:
- అకస్మాత్తుగా గుండెపోటు ముంచుకొచ్చినప్పుడు.. తొలి గంట (గోల్డెన్ అవర్) చాలా కీలకం.
- ఈ సమయంలో ఓ అత్యవసర ఇంజక్షన్ ఇస్తే.. రోగి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది.
- తర్వాత పెద్ద ఆస్పత్రికి వెళ్లి, అవసరమైన చికిత్సలు తీసుకోవచ్చు.
- దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రజారోగ్య విధానంలో కీలక చర్యలు చేపడుతోంది.
- చిన్న ఆస్పత్రులను (స్పోక్) దగ్గర్లో ఉన్న పెద్ద ఆస్పత్రులతో (హబ్) అనుసంధానించే విధానాన్ని విస్తృతం చేయబోతోంది.
- ఉన్నట్టుండి ఛాతీలో ఇబ్బందితో గుండెపోటు (ఎస్‌టి ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్-స్టెమీ) లక్షణాలు మొదలైతే.. ఈ విధానంలో ప్రాణాలు కాపాడటం సాధ్యమవుతుంది.
- రోగులకు వరంగా ఉండే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో ప్రారంభించబోతున్నారు.
- ఐసీఎంఆర్, దిల్లీ ఎయిమ్స్ మార్గదర్శకాల మేరకు అవసరమైన వారికి ఖరీదైన 'టెనెక్ట్‌ప్లేస్ ఇంజక్షన్'ను ఇస్తున్నారు.
- దీనివల్ల ప్రాణాపాయం తప్పి, రోగులు అవసరాన్ని బట్టి మరింత పెద్ద చికిత్సను పొందే వెసులుబాటు లభిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఉచితంగానే ఖరీదైన ఇంజక్షన్:
- గుండెపోటు లక్షణాలు మొదలైన తొలి గంటలో ఇవ్వాల్సిన 'టెనెక్ట్‌ప్లేస్ ఇంజక్షన్' ధర బహిరంగ మార్కెట్లో రూ.40-45వేల వరకు ఉంటుంది.
- ఈ ఇంజక్షన్ ప్రభుత్వానికి రూ.19వేలకు సరఫరా అవుతోంది.
- దీన్ని అవసరమైనవారికి చిన్న ఆస్పత్రులలో(స్పోక్స్) పూర్తి ఉచితంగా అందిస్తున్నారు.
- ఇంజక్షన్ పొందిన రోగులను, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బోధనాసపత్రుల్లో క్యాథ్‌ల్యాబ్స్ ఉన్నచోట్లకు పంపుతున్నారు.
- అవి లేనిచోట ఆరోగ్యశ్రీ అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు.
అధిక వ్యాయామంతో గుండెపోటు!- ఈ లక్షణాలు కనిపిస్తే డేంజరే - HEART ATTACK SYMPTOMS