Lokesh On MOU With Meta : క్యాస్ట్ సర్టిఫికెట్ కావాలంటే మూడు గవర్నమెంట్ ఆఫీసులు, నలుగురు వరకూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిరగాల్సి వచ్చేది. కరెంటు, నల్లా, ఇంటి పన్ను, ఇతరత్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాలయాల్లో ఇప్పటికీ ఎడతెగని క్యూలలో నిరీక్షణ తప్పదు. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఈ సర్టిఫికెట్ల కష్టాలను యువత ఏకరువు పెట్టారు. వాట్సప్‌లో ఒక్క టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికే అవసరమైన సమస్త వస్తువులు వస్తున్నాయి. అదే విధంగా ప్రతి సేవలూ అందుతున్నాయి. అలాంటప్పుడు సర్టిఫికెట్ల కోసం ఆఫీసులు చుట్టూ పనులు మానుకుని మరీ తిరగాల్సిన పరిస్థితికి చెక్ పెడతామని, ప్రభుత్వంలోకి రాగానే వాట్సప్ ద్వారా పర్మినెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం: అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ప్రాధాన్యతాక్రమంలో అమలు చేస్తున్నారు. ప్రతి ఏటా క్యాస్ట్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాట్సప్ ద్వారా పొందే పద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వివిధ రకాల బిల్లులను సైతం వాట్సప్ ద్వారా చెల్లించేయవచ్చు. దీని కోసం మెటాతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
నేషనల్ హైవే పనులు ఇక రయ్రయ్ - ఏడు కీలక ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
I’m delighted to announce a landmark cooperation between the Government of AP and Meta to enable citizen-centric public services through WhatsApp. This collaboration will soon efficiently deliver public services through Meta’s innovative technology, and ensure that our… pic.twitter.com/SZurDDfP08
— Lokesh Nara (@naralokesh) October 22, 2024
వాట్సప్ బిజినెస్ ద్వారా మరిన్ని సేవలు: ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచమంతా విస్తరించిన మెటాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేశ్ చొరవతో వాట్సప్ బిజినెస్ ద్వారా ప్రజలకు పౌరసేవలను అందించేందుకు మెటా అంగీకరించింది. మెటా ఫ్లాట్‌ఫాం వాట్సప్ బిజినెస్ ద్వారా ఇకపై క్యాస్ట్, ఇతరత్రా సర్టిఫికెట్లు వేగంగా, సులభంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి కన్సల్టేషన్ టెక్నికల్ సపోర్ట్, ఈ గవర్నెన్స్ అమలు, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా మరిన్ని సిటిజెన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు దిల్లీలో ఎంవోయూ చేసుకున్నారు.
మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మకమైన మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. యువగళం పాదయాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ సర్టిఫికెట్ల కోసం పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా చూసి, మొబైల్‌లోనే ఆయా సర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చానని అన్నారు. మాట ఇచ్చినట్టే నేడు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సప్‌లోనే సర్టిఫికెట్లు, పౌరసేవలు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవలు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పారదర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు.
జెట్ స్పీడుతో పనిచేస్తున్న లోకేశ్: మెటాలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సేవలను వాడుకుని వాట్సప్ ద్వారా ఏపీ ప్రజలకు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని సంధ్యా దేవనాథన్, వైస్ ప్రెసిడెంట్, మెటా ఇండియా ప్రకటించారు. అందరూ తమకు కావాల్సిన సేవలు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, వాట్సప్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ ఉంటుందని, తమ డిజిటల్ టెక్నాలజీని వాడుకుని ఏపీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని ఉత్తమసేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్‌సీఎల్ విస్తరణ, ఫాక్స్ కాన్, టీసీఎల్ వంటి గేమ్ ఛేంజర్ కంపెనీలను ఏపీకి రప్పించిన లోకేశ్.. మెటాతో ఒప్పందంతో తానేంటో, తన పనితీరు ఏ రేంజులో ఉంటుందో చెప్పకనే చెప్పారు. చంద్రబాబు ఈ గవర్నెన్స్ ఆలోచనలను అమలు చేయడంలో లోకేశ్ జెట్ స్పీడుతో పనిచేస్తున్నారు.