Dammalapati Srinivas Appointed AG in AP : ఏపీ అడ్వకేట్ జనరల్‌గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు న్యాయ శాఖ కార్యదర్శి సత్యప్రభాకర్ రావు ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఆదేశాలు ఇచ్చారు. శ్రీనివాస్ ఏజీగా నియమితులవడం ఇది రెండోసారి. గతంలో టీడీపీ సర్కార్ ప్రభుత్వ హయాంలో 2016 మే 28 నుంచి 2019 వరకు అడ్వకేట్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కంచికచర్లలో నాగేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులకు దమ్మాలపాటి శ్రీనివాస్ జన్మించారు. 1991లో వెలగపూడి దుర్గాంబ సిద్ధార్థ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదే సంవత్సరం బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. తర్వాత సీనియర్ న్యాయవాది ఎస్.ఆర్.అశోక్ వద్ద రాజ్యాంగం, క్రిమినల్, పన్నులకు, సివిల్, సంబంధించిన కేసుల్లో ప్రాక్టీస్ చేసి మంచి పేరు సంపాదించారు.
1996 నుంచి 2005 వరకు రైల్వే స్టాండింగ్ కౌన్సిల్‌గా, 1999 నుంచి 2003 వరకు కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు. 1996 నుంచి 2002 వరకు ఆదాయపు పన్ను శాఖ జూనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపాలిటీలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు నిర్వర్తించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. పలు కార్పొరేట్ సంస్థలకు న్యాయవాదిగా, న్యాయ సలహాదారుగా సేవలందించారు.
మొదట అదనపు ఏజీగా : 2014 జూన్ 30 నుంచి ఆంధ్రప్రదేశ్ అదనపు ఏజీగా హైకోర్టు, సుప్రీంకోర్టు, హరిత ట్రైబ్యునల్ వద్ద పలు కీలక కేసుల్లో ఏపీ సర్కార్ తరఫున వాదనలు వినిపించి విజయం సాధించారు. హైకోర్టులో పోలవరం ప్రాజెక్టు భూసేకరణ కేసులు, చిత్తూరు జిల్లా ఎర్రచందన కూలీల ఎన్‌కౌంటర్ కేసు, చిత్తూరు జిల్లాలో హీరో మోటోకార్ప్‌కు కేటాయించిన భూ వివాదంపై కేసులు, పట్టిసీమ ప్రాజెక్టును సవాలు చేస్తూ దాఖలైన కేసు, రాజధాని అమరావతి భూసమీకరణ పథకంపై కేసులలో వాదనలు వినిపించి అవరోధాలు తొలగిపోయేలా చేశారు. 2014 జూన్ నుంచి ఏజీగా ఉన్న సీనియర్ న్యాయవాది పి.వేణుగోపాల్ రాజీనామా చేయడంతో 2016 మే 28న దమ్మాలపాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏజీగా నియమించింది.
సమర్థంగా వాదనలు : చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైసీపీ సర్కార్ వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ సందర్భంలో చంద్రబాబు హక్కులను కాపాడడంలో దమ్మాలపాటి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు ఆయన అలుపెరగని న్యాయ పోరాటం చేశారు. మరోవైపు కక్షసాధింపు కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులలో టీడీపీ నేతల పక్షాన సమర్థంగా వాదనలు వినిపించారు.
పలు మీడియా సంస్థలను వేధించడం కోసం గత సర్కార్ నమోదు చేసిన తప్పుడు కేసుల్లో దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించి వాటిని తిప్పికొట్టారు. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్-5 జోన్ ఏర్పాటు, 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవోలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలలో విజయవంతంగా వాదనలు వినిపించారు.