Government Denies to Relieve Officers: రాష్ట్రానికి డిప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులకు సంబంధించి ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. తమను రిలీవ్ చేయాలంటూ డెప్యుటేషన్ పై వచ్చిన అధికారులు చేసుకుంటున్న దరఖాస్తులను పక్కన పెట్టాలని ఆదేశించింది.
గడచిన మూడేళ్లుగా వైఎస్సార్సీపీతో అంటకాగి ప్రజాప్రయోజనాలు తాకట్టు పెట్టేలా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రామకృష్ణ తనను రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇసుక సహా అత్యంత విలువైన భార ఖనిజాలను ప్రైవేటుకు ధారాదత్తం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించేలా వ్యవహరించిన గనుల శాఖ ఎండీ వీజీ వెంకటరెడ్డి తాను కేంద్రానికి వెళ్తానంటూ ఆర్జీ పెట్టుకున్నారు. తక్షణం బాధ్యతల నుంచి రీలీవ్ చేయాల్సిందిగా సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా సీఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు.
ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి లబ్ధి కలిగించేలా అనధికారికంగా మద్యం పంపిణీ చేసేందుకు ప్రయత్నించి ఈసీ బదిలీ వేటు పడిన ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి కూడా తనను మాతృ సంస్థకు పంపాలని కోరారు. అలాగే ఏపీ నుంచి రీలీవ్ చేయాల్సిందిగా ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ చిలకల రాజేశ్వర్ రెడ్డిలు సీఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు తెలంగాణాకు వెళ్లేందుకు ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్న ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, శ్రీలక్ష్మితో సహా ఇతర అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. అటు ఏపిలో పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సతీమణులు కూడా డిప్యూటేషన్‌ను రద్దు చేసుకుని వెనక్కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని నిర్ణయం: బదిలీల నిలిపివేతతో పాటు ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెలవుపై వెళ్తానంటూ తిరుమల తిరుమతి దేవస్థానం ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి చేసుకున్న అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించింది. సీఎస్ ఆదేశాల మేరకు ఇప్పటికే సెలవు ప్రతిపాదనను సీఐడీ చీఫ్ సంజయ్ వెనక్కు తీసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా టాటాలకు మాత్రం ఫలితాల కంటే ముందే సీఎస్ జవహర్ రెడ్డి సెలవులు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. వీరికి ఎన్నికల విధులు కాకుండా ఇతర పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉన్నా ఉద్దేశ్య పూర్వకంగానే ఇవ్వలేదని తెలుస్తోంది.
సచివాలయం ఐటీ విభాగంలో పోలీసుల తనిఖీలు - Police Chekings in the Secretariat