AP Govt on Vijayawada Development : విజయవాడ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైపులైన్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించింది. రోడ్లపై ఏర్పడిన గుంతలు యుద్ధ ప్రతిపదికన పూర్తి చేస్తున్నారు. నగరంలో మురుగు కాలువల సమస్యకు శాశ్వత పరిష్కారం , డ్రైన్లకు మరమ్మతులు, కాలువల నిర్మాణ పనులను వీఎంసీ ప్రారంభించింది.
గత ఐదేళ్లలో విజయవాడలో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించడంలో వైఎస్సార్సీపీ సర్కార్ విఫలమైంది. ఇంటింటికి అందిస్తున్న తాగునీరు సరిగ్గా అందక వీఎంసీ విడుదల చేస్తున్న నీరు రంగు మారి రావడంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గతంలో విజయవాడ అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయిస్తామని వైఎస్సార్సీపీ హయాంలో జగన్ చెప్పినా ఆ నిధుల్లో కనీసం పది శాతం విడుదల చేయలేదు. వాటిని రాబట్టడంలో స్థానిక ప్రజాప్రనిధులూ విఫలమయ్యారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విజయవాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇటీవల వీఎంసీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో పురపాలకశాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. విజయవాడలో తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు ప్రారంభించాలని అధికారులకు మంత్రి నారాయణ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని కార్పొరేటర్లు చెబుతున్నారు.
నిధులు కేటాయించిన వీఎంసీ : వీఎంసీ పరిధిలో డిసెంబర్ చివరికల్లా రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతోపాటు అవసరమైన చోట నూతన రోడ్లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని డివిజన్లలో రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు వీఎంసీ కేటాయించింది. ఆ పనులన్నీ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఓపెన్ డ్రైన్లు, భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కరిస్తామని కార్పొరేటర్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం నగర అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉందని వీఎంసీ కార్పొరేటర్లు అభిప్రాయపడుతున్నారు. గత ఐదేళ్లలో నగరంలో అవినీతి రాజ్యమేలిందని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు.
విజయవాడలో ఇక సాఫీగా ప్రయాణం - ఊపిరి పీల్చుకుంటున్న సామాన్యులు
విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు - తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం