Grama Sabhalu in AP 2024 : వైఎస్సార్సీపీ సర్కార్ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామ పంచాయతీలను తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం స్వర్ణ గ్రామపంచాయతీ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. నాలుగు అంశాలతో గ్రామీణాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజున గ్రామసభలు నిర్వహించనున్నారు.
Gram Sabhas in Andhra Pradesh : సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు పాల్గొని గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేయనున్నారు. మొదటి అంశంలో ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు, మరుగుదొడ్డి సదుపాయం, వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంపై చర్చించనున్నారు. రెండో అంశం కింద మురుగు కాలువలు, మురుగునీటి వ్యవస్థ నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, ఘనవ్యర్థాల నిర్వహణపై చర్చిస్తారు. అలాగే మూడో అంశంగా గ్రామంలో అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు లింక్‌రోడ్లపై చర్చలు జరుపుతారు. నాలుగో అంశంగా ఇంకుడుగుంతలు, పంటకుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాల కల్పన, పశువుల పెంపకంపై చర్చించనున్నారు.
ఉపాధిహామీ పథకంపై అవగాహన : గ్రామాల అభివృద్ధిలో కీలకంగా మారిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సరికొత్త ఒరవడిని తీసుకురానుంది. సెప్టెంబర్ - మార్చి మధ్య ఏడు నెలల కాలంలో చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రణాళికలు తయారు చేయనున్నారు. గ్రామసభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి ఇందులో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని సర్కార్ భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు గ్రామసభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి వీటిని నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆర్థికసంఘం నిధులు రూ.2 వేల కోట్లు స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఉపాధి పనులు క్రమపద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించింది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద పనిదినాలు కల్పించనున్నారు.
గ్రామాల ప్రత్యేకతలకు బ్రాండ్‌తో ఆదాయం : గ్రామాలను స్వయంశక్తి కేంద్రాలుగా మార్చుకుందామని అందుకే గ్రామసభల్లో ప్రతిఒక్కరూ పాల్గొనాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ఏయే పనులు చేయోలో చర్చించి దగ్గర ఉండి చేయించుకోవాలని తెలిపారు. పల్లెల్లో ఏ పనులు చేస్తున్నారో ప్రజలందరికీ అర్థమయ్యేలా సిటిజన్ ఇన్‌ఫర్మేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. గ్రామాల ప్రత్యేకతలకు బ్రాండ్‌తో ఆదాయం పెంచుతామన్నారు.
"రెండో తరం సంస్కరణలతో పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నాం. గ్రామాభివృద్ధికి తోడ్పడేలా ప్రజలు పాల్గొనాలి. ప్రతి పంచాయతీకి కొన్ని ప్రత్యేకలు ఉన్నాయి. ఉప్పాడ, మంగళగిరి చీరలకు ప్రత్యేకమని విశాఖ జిల్లా ఆనందపురం పూలకు, లేపాక్షిలో హస్తకళలకు, అరకు కాఫీకి ఇలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి ఊళ్లను గుర్తించి బ్రాండ్ అభివృద్ధి చేసి పంచాయతీల ఆదాయం పెంచుతాం." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
ఉప్పాడ, మంగళగిరి చీరలకు ప్రత్యేకమని విశాఖ జిల్లా ఆనందపురం పూలకు, లేపాక్షిలో హస్తకళలకు, అరకు కాఫీకి ఇలా ప్రత్యేకతలు ఉన్న ఊళ్లను గుర్తించి బ్రాండ్ అభివృద్ధి చేసి పంచాయతీల ఆదాయం పెంచనున్నట్లు పవన్ చెప్పారు. పంచాయతీ భూముల్లో కలప పెంచి ఆదాయ మార్గాలను కల్పిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సర్పంచ్ అధ్యక్షతన జరిగే గ్రామసభల్లో ఏ పనులు చేపట్టాలన్న నిర్ణయాధికారం గ్రామస్తులకే అప్పగించనున్నారు.
గ్రామసభల్లో భూ సమస్యలకు 3 నెలల్లో పరిష్కారం - కేబినెట్ భేటీలో నిర్ణయం - AP Cabinet Decisions