AP Government Cheating Banks: రాజధాని అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టులకు గత ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చింది. 2వేల 560 కోట్ల అంచనా వ్యయంతో రాజధాని పరిపాలన నగరంలో బహుళ అంతస్తుల నివాస సముదాయాలు తలపెట్టింది. యూబీఐ లీడ్ బ్యాంకుగా ఉన్న కన్సార్షియం ఈ ప్రాజెక్టుకు 2వేల 60 కోట్లు మంజూరు చేసింది. అందులో సీఆర్డీఏకు సుమారు 19 వందల 50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది.
మొత్తం 3 వేల 840 ఫ్లాట్లతో అపార్ట్‌మెంట్ల నిర్మాణం 62 నుంచి గరిష్ఠంగా 74 శాతం వరకు పూర్తయి ఉండగా, అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ పనులను ఎక్కడివక్కడ నిలిపివేసింది. తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. నిబంధనల ప్రకారం రుణం ఇచ్చిన బ్యాంకులకు ఎప్పటికప్పుడు నిర్మాణ పురోగతి చూపించాలి. ఒప్పందం ప్రకారం నిరుడు ఫిబ్రవరిలోనే నిర్మాణం పూర్తి కావాలి. అయితే అప్పటికే చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి అనీ, పలువురు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నారని అధికారులు కట్టుకథలు చెప్పారు. మిగిలిన ఫ్లాట్ల నిర్మాణం 2024 ఫిబ్రవరి 13 నాటికి పూర్తి చేస్తామని నమ్మించారు.
అమరావతిపై జగన్ సర్కార్ మరో కుట్ర! - మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేసే ప్రయత్నం
అమరావతిని వైసీపీ ప్రభుత్వం అటకెక్కించేసిందని తెలిసినా ఈ కథలన్నింటికీ బ్యాంకు అధికారులు తలూపేశారు. ఒక ఏడాది గడువూ పొడిగించారు. అది కూడా నేటితో ముగుస్తోంది. గడువులోగా ప్రాజెక్టు పూర్తవకపోతే బ్యాంకులు దాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించే ప్రమాదముంది. అదే జరిగితే రుణం మొత్తాన్ని సీఆర్‌డీఏ ఒకేసారి చెల్లించాలి. ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు సీఆర్డీఏ.. బ్యాంకు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుకూలంగా డీసీసీవో పత్రం ఇప్పించుకునేలా రంగం సిద్ధం చేసినట్లు, ఈ విషయమై బ్యాంకు అధికారులతో కూడా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
2017లో ఈ ప్రాజెక్టు అంచనాలు తయారు చేసినప్పుడు 2వేల 560 కోట్లుగా ఖరారు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ అయిదేళ్లలో పనులు నిలిపివేయడంతో అంచనా వ్యయం బాగా పెరిగింది. దీనికి తోడు బ్యాంకులు మంజూరు చేసిన మొత్తంలో ఇంకా సుమారు 110 కోట్లు విడుదల కావాలి. మరోవైపు ప్రాజెక్టు వ్యయంలో తన వాటాగా ఇవ్వాల్సిన 500 కోట్లను ప్రభుత్వం నేటికీ విడుదల చేయలేదు. దీంతో ఫ్లాట్ల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. విద్యుత్తు, తాగునీరు, మురుగునీటిపారుదల తదితర వసతులేవీ సమకూరలేదు.
ఈ నేపథ్యంలో బ్యాంకులు హౌసింగ్ ప్రాజెక్టును నిరర్థక ఆస్తిగా ప్రకటిస్తే దానికి గ్యారంటీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే రుణభారాన్ని కూడా మోయాలి. అది కూడా ఒకేసారి రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి బ్యాంకులకు కట్టాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇంత భారీ మొత్తాన్ని ఆగమేఘాలపై చెల్లించడం జగన్ ప్రభుత్వానికి దాదాపు అసాధ్యం. దీంతోపాటు భవిష్యత్తులో బ్యాంకుల నుంచి రుణ మంజూరూ కష్టమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చెప్పినట్లు నిర్మాణాలు పూర్తయిపోయాయని ధ్రువపత్రం ఇస్తే.. రానున్న రోజుల్లో ఏం ఇబ్బందులు వస్తాయోనన్న ఆందోళన సీఆర్డీఏ అధికారులను వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్డీఏ, బ్యాంకు అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. స్పందించేందుకు నిరాకరించారు.
రాష్ట్ర ప్రజలనే కాదు.. అబద్ధాలతో వైసీపీ ప్రభుత్వం కోర్టులను సైతం మోసం..