AP Election Results 2024 Defeat Of YSRCP Ministers : వైఎస్సార్సీపీ విజయం సాధించిన 11 అసెంబ్లీ స్థానాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా జగన్ క్యాబినెట్‌లో పనిచేసిన మంత్రులెవరూ గెలుపొందలేదు. వారందరిపైనా గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని ప్రజలు ఓటు రూపంలో బయటపెట్టారు. భారీ ఆధిక్యాన్ని కూటమి అభ్యర్థులకు ఇచ్చి మంత్రులకు పరాభవాన్నిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెడితే రెండు విడతల్లో మంత్రులుగా పనిచేసిన ధర్మాన సోదరులిద్దరూ ఓటమి చవిచూశారు. శ్రీకాకుళం నుంచి బరిలో నిలిచిన ధర్మాన ప్రసాదరావు తెలుగుదేశం అభ్యర్థి గొండు శంకర్ చేతిలో పరాజయంపాలయ్యారు. అలాగే ఆయన సోదరుడు మాజీ మంత్రి ధర్మాస కృష్ణదాస్‌నరసన్నపేటలో తెలుగుదేశం అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో ఓటమి చవిచూశారు. పలాస నుంచి బరిలోకి దిగిన మంత్రి సీదిరి అప్పలరాజు తెలుగుదేశం అభ్యర్థి గౌతు శిరీష చేతిలో ఓటమి పాలయ్యారు.
మంత్రి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు. కురుపాం వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణిపైడ టీడీపీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరాపు చేతిలో ఘోర పరాజయం పొందారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి బరిలోకి దిగి గంటా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు.
జగన్ కేబినెట్‌లో తొలివిడతలో మంత్రిగా పనిచేసిన చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆచంట టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ చేతిలో ఓడారు. ఇక తణుకు టీడీపీ అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ చేతిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరాజయం పాలయ్యారు. దేవదాయశాఖ మంత్రిగా చేసిన కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం నుంచి పోటీచేసి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. సాలూరు నుంచి బరిలో దిగిన పీడిక రాజన్నదొరపై టీడీపీఅభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించారు. తుని నుంచి పోటీచేసిన మంత్రి దాడిశెట్టి రాజా టీడీపీ అభ్యర్థి యనమల దివ్య చేతిలో ఓటమిపాలయ్యారు. కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు జనసేన అభ్యర్థి పంతం నానాజీ చేతిలో పరాభవం చవిచూశారు.
అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌నుతెలుగుదేశం అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఓడించారు. ఏలూరులో మాజీ మంత్రి ఆళ్ల నానిపై బడేటి రాధాకృష్ణ విజయం సాధించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌నువిజయవాడ సెంట్రల్ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు చిత్తుచేశారు. డోన్ నుంచి బరిలో దిగిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి జయకేతనం ఎగురవేశారు. పెనుకొండ నుంచి పోటీ చేసిన మంత్రి ఉష శ్రీచరణ్‌పై తెలుగుదేశం అభ్యర్థి సవిత గెలుపొందారు. మంత్రి రోజాపై నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌రెడ్డి విజయం సాధించారు.
మంత్రి అంబటి సత్తెనపల్లి నుంచి బరిలో దిగి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో పరాజయం పాలయ్యారు. కొడాలి నాని గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము చేతిలో పరాభవం పొందారు. మాజీ మంత్రి శంకర నారాయణ అనంతపురం ఎంపీగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ చేతిలో ఓటమి చవిచూశారు. మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం రూరల్ నుంచి పోటీ చేసి గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేతిలో భారీ పరాజయం మూటగట్టుకున్నారు. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తాడికొండలో బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి తాడికొండ శ్రావణ్‌కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. గోపాలపురం నుంచి బరిలో దిగిన హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ఘనవిజయం సాధించారు.
గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన మంత్రి విడదల రజినిపై టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి గెలుపొందారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా కడప టీడీపీ అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి చేతిలో పరాభవం పొందారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ కొండపి నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి చేతిలో ఓటమి పాలయ్యారు. మరో మంత్రి మేరుగు నాగార్జున సంతనూతలపాడు టీడీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ చేతిలో ఓడిపోయారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. మరో మంత్రి జోగి రమేశ్ పెనమలూరు నుంచి బరిలో దిగి టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ చేతిలో ఓటమి చవిచూశారు. మాజీ మంత్రి బాలినేని ఒంగోలులో టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో పరాజయం పాలయ్యారు.