AP Woman Dead Due to Heart Attack in Bus : భర్తకు సహాయంగా ఉండాలని, పిల్లలను బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో అప్పులు చేసి మరీ జీవనోపాధి కోసం ఓ మహిళ మస్కట్ వెళ్లారు. అక్కడ ఇబ్బందులు తట్టుకోలేక తన స్వగ్రామానికి తిరిగి వస్తూ గుండెపోటుతో మార్గమధ్యలో బస్సులోనే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల సమాచారం ప్రకారం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కోరుమామిడికి చెందిన బొంతా సత్యపద్మకు పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన ప్రభాకర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇదీ జరిగింది : కూలి పనులు చేస్తూ దాచిన సొమ్ముకు మరికొంత నగదు అప్పు చేసి ఆ మొత్తం సొమ్ము రూ.2 లక్షలు విజయవాడకు చెందిన మహిళా ఏజెంట్‌కు చెల్లించి రెండేళ్ల క్రితం మహిళ మస్కట్‌కు వెళ్లారు. మస్కట్‌లో యజమానుల ఇబ్బందులు తట్టుకోలేక దానికితోడు ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆమె తిరిగి వెళ్లిపోతానని ఆరు నెలలుగా వారికి మొర పెట్టుకుంటున్నారు. సత్యపద్మను వెనక్కి పంపించాలని భర్త ఎన్నో సార్లు మహిళా ఏజెంట్‌ను వేడుకున్నప్పటికీ ఆమె మనసు కరగలేదు. మరో రూ.2 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆమెకు ఆ డబ్బులను ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఇంటికి తిరిగొస్తుందనుకుంటే ఆమె విగతజీవిగా మారి తిరిగొచ్చారు.
గుండెపోటుతో చనిపోయిందని డిపో నుంచి ఫోన్ : ఏజెంట్‌కు తాను డబ్బులు చెల్లించిన తర్వాత ఎటువంటి సమాచారం ఇవ్వలేదని సత్యపద్మ భర్త ప్రభాకర్ అన్నారు. ఈ నెల 30న పంపిస్తామని చెప్పి 24నే పంపించేశారన్నారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా తనకు సమాచారం అందించలేదని ప్రభాకర్ చెప్పారు. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి, తణుకు బస్సు ఎక్కినట్లు అతడు వివరించారు. మస్కట్ నుంచి వస్తున్న మహిళ గుండెపోటుతో మృతి చెందినట్లు విజయవాడ బస్ డిపో నుంచి 24న సాయంత్రం తమకు ఫోన్ చేసి చెప్పారని మృతురాలి భర్త కన్నీరు పెట్టారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పినప్పటికీ దగ్గరుండి చూసుకుంటానని నమ్మబలికి ఏజెంట్ మూడు నెలలు ఆమె దగ్గర పెట్టుకుని ఇబ్బందులకు గురిచేసిందని సత్యపద్మ భర్త కంటతడి పెట్టారు.
ఉపాధి కోసం సరిహద్దులు దాటి నగరానికి బంగ్లాదేశ్ యువతి - వ్యభిచార కూపంలోకి దించిన దంపతులు, చివరికి!