E-Cabinet Meeting Today in Secretariat : గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ దిశగా రాష్ట్ర మంత్రివర్గం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించాలని కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా మంత్రివర్గంలో చర్చించి చర్యలు చేపట్టనుంది. ఎక్సైజ్ శాఖలోని సెబ్ విభాగం రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి చెల్లు చీటిపైనా మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతోంది. సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటి కానుంది. 2014-19 మధ్య ఇ-కేబినెట్ నిర్వహించిన అప్పటి టీడీపీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మంత్రి వర్గ సమావేశం నిర్వహణకు నిర్ణయం తీసుకుంది. 12 అంశాల ఆధారంగా రూపొందిన విజన్ 2047 డాక్యుమెంట్‌పైనా కేబినెట్‌లో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై మంత్రుల సలహాలు అభిప్రాయాలు తీసుకోనున్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు అస్తవ్యస్తంగా విభజన చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దుపైనా కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సెబ్‌ను రద్దు చేసి తిరిగి ఎక్సైజ్ శాఖలో విలీనం చేయాలనే ప్రతిపాదనపై కొంత కాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసే అంశంపైనా కేబినెట్‌లో కీలక చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ శాఖను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టాలని క్షేత్ర స్థాయిలో గ్రామ సచివాలయాల్లో పని చేసే వివిధ శాఖల కార్యదర్శులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విషయమై కొద్దిరోజులుగా కసరత్తు సాగుతోంది. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్వ్యస్థీకరించే దిశగా మంత్రివర్గంలో చర్చ జరగనుంది.
రేషన్ బియ్యం అందించే వాహనాల ద్వారా అక్రమాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎండీయూలను ప్రత్యామ్నాయ కార్యకలాపాలకు వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను రద్దు చేస్తూ కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ అక్రమాలపైనా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి కూటమి ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. గతంలో ఉన్న పాతటెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకురానుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనలను మంత్రిమండలి ముందు ఉంచనుంది. దీనిపై మంత్రి మండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉంది.