AP CS Neerabh Kumar Prasad Review: ఏపీలో అమలవుతోన్న పలు కేంద్ర ప్రాయోజిత పథకాలను మరింత వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలని, తద్వారా కేంద్రం నుంచి మరిన్ని పథకాలు, నిధులు రాబట్టేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్‌పై వైద్య ఆరోగ్య, వ్యవసాయ, సహకార, ఉద్యానవన, మత్స్య, మున్సిపల్ పరిపాలన, గృహ నిర్మాణ, ఆర్ధిక శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఇప్పటికే అమలులో ఉన్న పలు ప్రాయోజిత పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించి జాప్యం లేకుండా వాటిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు.
పూర్తైన పనులకు సకాలంలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లను కేంద్రానికి సమర్పిస్తే తదుపరి వాయిదా నిధులు మంజూరు అయ్యే వీలుంటుందని ఆ దిశగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం ప్రవేశపెట్టి రాష్ట్రంలో అమలు కాని ఇతర ప్రాయోజిత పథకాలను కూడా అమలు చేసేందుకు పరిశీలించాలని సీఎస్ సూచించారు. రాష్ట్ర జీడీపీలో మూడో వంతు ఉన్న ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి మంజూరైన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్‌లను వేగవంతంగా పూర్తి చేయడం సహా మరిన్ని నిధులు, పథకాలను రాష్ట్రానికి తెచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి దిశగా చర్యలు: ముఖ్యంగా చేపల, రొయ్యల చెరువుల వివరాలన్నిటినీ నూరు శాతం కంప్యూటరీకరించడంతో పాటు ఆయా ఉత్పత్తులకు పరీక్షల నిర్వహించేందుకు తగిన ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రం నుంచి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నాబార్డు (National Bank for Agriculture and Rural Development), ఎంపెడా (Marine Products Export Development Authority) ల ద్వారా తగిన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి తగిన నిధులు మంజూరు చేయించుకునే అవకాశం ఉందని ఆ దిశగా తగిన ప్రణాళికలు సమర్పించాలని సూచించారు.
నిధులు విడుదలైతే ఎక్కువ మందికి లబ్ది: ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పడకల పెంపు, క్రిటికల్ కేర్ బ్లాకులు వంటి వైద్య పరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ఐదేళ్ల కాలానికి 367 కోట్లు మంజూరయ్యాయని, వాటి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద గర్బిణీ స్రీలకు 5 వేల రూపాయలు చెల్లించే పథకం అమలు జరుగుతోందని వాటికి సకాలంలో నిధులు విడుదలైతే ఎక్కువ మందికి లబ్ది చేకూరుతుందని తెలిపారు.
మూడేళ్లలో 95 లక్షల ఇళ్లకు సురక్షిత నీరు: సీఎం చంద్రబాబు - CM CBN Review on Jaljeevan Mission
మరో 7 వేల కోట్లు అవసరం: మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన టిడ్కో గృహాల ప్రాజెక్టును 21 వేల 377 కోట్లతో చేపట్టగా దానిలో కేంద్రం వాటా 3 వేల 924 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 8595 కోట్లు, లబ్దిదారుల వాటాగా 8856 కోట్లుగా ఉందని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 16 వేల 900 కోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేసేందుకు మరో 7 వేల కోట్లు అవసరం ఉందని సీఎస్ దృష్టికి తెచ్చారు. బలహీన వర్గాల గృహనిర్మాణానికి సంబంధించి పీఎంఏవై అర్బన్ కింద 31 వేల 146 కోట్లతో వివిధ గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకూ 17 వేల 359 కోట్లు ఖర్చు చేశామని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివాన్ మైదీన్ వివరించారు.
అలాగే పీఎంఏవై గ్రామీణ్, తదితర పథకాల కింద గృహ నిర్మాణాలు జరుగుతున్నట్టు తెలిపారు. వ్యవసాయ శాఖలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద 737 కోట్లతో 8 పథకాలు అమలవుతుండగా దానిలో 442 కోట్లు కేంద్రం వాటా కాగా, 295 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పనులు జరుగుతున్నట్టు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ వివరించారు. అదే విధంగా కృషోతన్నతి యోజన కింద 7 ఉప పథకాలు అమలు జరుగుతున్నాయన్నారు. వ్యవసాయ మార్కెటింగ్ మరియు సహకార శాఖలకు సంబంధించి వివిధ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(PACS)కంప్యూటరీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా చేపట్టిందని రాష్ట్రంలో ఆ ప్రక్రియ వేగవంతంగా సాగుతోందని శాఖ కమిషనర్ బాబు వివరించారు.