AP CS on Grama Sabhalu and Sand Policy: ఈ నెల 23న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గ్రామ సభలు, ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, రహదార్లు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ గ్రామ సభలను ఉపయోగించాలని సీఎస్ కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ప్రజా ప్రతినిధులు ఈ గ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు. గ్రామ సభల నిర్వహణను జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడే రీతిలో ఈ గ్రామ సభలను విజయంతంగా నిర్వహించాలని అన్నారు. ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి మంజూరైన పనులు, కొత్త పనుల గుర్తింపు, సామాజిక తనిఖీపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాల్లో నూరు శాతం కనీస సేవలు కల్పించడం, ఉద్యానవన, పట్టుపరిశ్రమలకు తోడ్పాటు, పశువుల షెడ్ల నిర్మాణం వంటి వాటిపై కూడా చర్చించి వాటి కల్పనపై దృష్టి సారించాలని అన్నారు.
త్వరలోనే ఆన్‌లైన్, సచివాలయాల్లో బుకింగ్ సదుపాయం: సీఎం చంద్రబాబు - CM Teleconference with Activists
రాష్ట్రంలో సెప్టెంబరు 11 నుంచి నూతన ఇసుక విధానాన్ని అమలులోకి తేనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ విధానం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయనున్నట్టు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్ వారీగా ఇసుక తవ్వకం, రవాణాకు సంబంధించిన ధరలను కలెక్టర్లు నిర్ధారించాలని, ఆ ధరలకు మించి ఎక్కువకు విక్రయించినట్టు ఫిర్యాదులు వస్తే ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.
అంతేగాక ఆన్లైన్లో ఇసుక కోసం బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీన ఏ సమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలని అన్నారు. ఇసుక కోసం రిజిష్టర్ చేసిన వాహనాలను మాత్రమే ఇసుక రీచ్ల్లోకి అనుమతించాలని, ఇతర వాహనాలను ఎంతమాత్రం అనుమతించరాదని సీఎస్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు లోను, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ వద్ద పెద్దఎత్తున లారీలు, ట్రక్కులు గంటల తరబడి వేచి ఉంటున్నట్టు గమనించామని, అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలని ఆ రెండు జిల్లాల కలక్టర్లతో పాటు ఇతర కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు: పవన్ - Deputy CM Pawan Video Conference