Eenadu 50 Years Celebrations : ఈనాడు దినపత్రిక నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. పత్రిక యాజమాన్యం, సిబ్బంది, పాత్రికేయులు, పాఠకులకు ఆయన అభినందనలు తెలియజేశారు. విలువలు, విశ్వసనీయత, ప్రజల తరఫున పోరాటం, తలవంచని నైజంతో నిత్యనూతనంగా, అనునిత్యం ప్రజాహితమే లక్ష్యంగా సాగుతున్న ఈనాడు దినపత్రిక తెలుగు జాతికి లభించిన ఆభరణమని చంద్రబాబు కొనియాడారు. పత్రిక అంటే వ్యాపారం కాదని, సమాజహితమని నమ్మబట్టే ఐదు దశాబ్దాలుగా ఎవరూ అందుకోలేని స్థాయికి ఈనాడు చేరుకుందని ఏపీ సీఎం శ్లాఘించారు.
Eenadu Golden Jubilee Celebrations : 1974లో విశాఖలో ప్రస్థానాన్ని ప్రారంభించి, తెలుగు ప్రజల జీవనవిధానంలో భాగమైన అద్భుత ఆవిష్కరణ ఈనాడు అని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనం కోసమే జర్నలిజం ప్రజల కోసమే పత్రికారంగమని చాటిన ఐదు దశాబ్దాల అక్షర శిఖరమని చెప్పారు. ప్రజల గళం వినిపించడానికి ఆవిర్భవించి దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోందని అన్నారు. అక్షరయోధుడు రామోజీరావు తెలుగు జర్నలిజంపై వేసిన తిరుగులేని ముద్ర ఈనాడు అని చంద్రబాబు కొనియాడారు.
5 దశాబ్దాల ఈనాడుకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు pic.twitter.com/4OEVwJTW4f
— N Chandrababu Naidu (@ncbn) August 9, 2024
రామోజీరావు ఎప్పటికీ స్ఫూర్తి : తెలుగుజాతికి ఆస్తి లాంటి ఈనాడును అందించిన రామోజీరావుకు నివాళులర్పిద్దామని చంద్రబాబు తెలిపారు. ఈనాడును సమున్నతంగా తీర్చిదిద్దిన ఆయన్ను స్మరించుకుందామని చెప్పారు. 1974 ఆగస్టు 10న పుట్టిన ఈనాడు పత్రిక తెలుగు నేల కీర్తి దాని సృష్టికర్త రామోజీరావు ఎప్పటికీ స్ఫూర్తి అని చంద్రబాబు వెల్లడించారు.
మా ప్రభుత్వంలోని తప్పులనూ చూపించింది : కొన్ని లక్షల మందికి రోజువారీ దినచర్య ఈనాడు పఠనంతోనే ప్రారంభం అవుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఏ అంశం చర్చకు వచ్చినా ఈనాడులో వచ్చిందా? అని అడుగుతారని చెప్పారు. అదీ ఆ పత్రికకు ఉన్న విలువ గౌరవమని వివరించారు. ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఆ పత్రిక ఎప్పుడూ నిక్కచ్చిగా పని చేసిందని తెలిపారు. తమ ప్రభుత్వంలోని తప్పుల్ని ఈనాడు రాస్తే వాటిని సరిదిద్దుకున్న సందర్భాలు అనేకమని చంద్రబాబు వెల్లడించారు.
1984లో నాటి ప్రజాస్వామ్య ఉద్యమంలో ఈనాడు పోషించిన పాత్ర తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చంద్రబాబు తెలిపారు. విశ్వసనీయత ఉన్న ఒక పత్రిక న్యాయం వైపు నిలిచి వాస్తవాల్ని ప్రజలకు వివరిస్తే ఎంతటి ప్రజాచైతన్యం వస్తుందనే దానికి ఆ ఉద్యమం మచ్చుతునకని చెప్పారు. ప్రజాసమస్యలపై ప్రశ్నించడం ప్రజాచైతన్యం తేవడం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో సామాన్యుడి అక్షరాయుధంగా పనిచేసి అర్ధ శతాబ్దపు ప్రయాణాన్ని పూర్తిచేసుకుందని చంద్రబాబు ఎక్స్ వేదికగా శ్లాఘించారు.
"ఈనాడు" అక్షర సమరానికి నేటితో 50 ఏళ్లు! - స్పెషల్ ఫొటో గ్యాలరీ మీకోసం - Eenadu 50 Years Celebrations