Chandrababu Visit to Flood Affected Areas : ముంపు గుప్పిట్లో ఉన్న ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పలుమార్లు పర్యటించారు. వరద విలయం నుంచి విజయవాడను గట్టెక్కించడమే లక్ష్యంగా చంద్రబాబు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఉదయం నుంచి సింగ్ నగర్, యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్, జక్కంపూడి ప్రాంతాలను పరిశీలించారు.
మోకాళ్ల వరకు నీరు ఉన్న ప్రాంతాల్లో కాలినడకన, ఇంకా ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా చంద్రబాబు నేరుగా బాధితుల వద్దకు వెళ్తున్నారు. జక్కంపూడి, సితార సెంటర్‌లో జేసీబీ ఎక్కి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. బాధితుల కష్టాలు అడిగి తెలుసుకుంటున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదులు అధికారులకు చెప్పి అప్పటికప్పుడు పరిష్కారానికి ఆదేశిస్తున్నారు.
Food Distribution through Drone In AP : విజయవాడ వరదలో చిక్కుకుపోయిన కాలనీల్లో ఆహార పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. చాలా కాలనీల్లో మొదటి అంతస్థు వరకు నీరు ఉండటం, పై అంతస్థుల్లో ఉన్నవారికి నిత్యవసర వస్తువులు, ఆహారం అందించడం కష్టం అవడంతో డ్రోన్ల సాయం తీసుకున్నారు.
సింగ్ నగర్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది. స్పీడ్ బోడ్లలో కాలనీ వరకు వెళ్లిన సిబ్బంది అక్కడి నుంచి డ్రోన్ల ద్వారా అపార్ట్మెంట్లలో ఉన్నవారికి సరుకులు అందిస్తున్నారు. ఈ డ్రోన్ల ద్వారా ఒకేసారి 5 కిలోల వరకు అవసరమైన సామాగ్రి పంపించవచ్చు. అంతకుముందు ఈ డ్రోన్ ఆపరేషన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు ప్రత్యక్షంగా వీక్షించారు.
మరోవైపు వరద బాధితుల కోసం ఏపీ ప్రభుత్వం భారీ ఎత్తున ఆహార పొట్లాలు సిద్ధం చేసింది. అక్షయపాత్ర ఫౌండేషన్ మంగళగిరి నుంచి 3 లక్షల మందికి ఆహారం తయారు చేసి విజయవాడకు పంపింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకేసారి 3 లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది. తమ సర్వీసులో ఇదే అతిపెద్ద రికార్డు అని అక్షయపాత్ర సిబ్బంది తెలిపారు. దివీస్ సంస్థ కూడా అక్షయపాత్ర సహకారంతో రోజూ 1.70 లక్షల మందికి ఆహారం అందిస్తోంది.