AP CM Chandrababu Meet Nirmala Sitharaman : దిల్లీలో రెండో రోజూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆమెకు నివేదించి ఏపీకి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తగిన సాయం అందేలా చూడాలని విన్నవించినట్లు సమాచారం.
నిర్మలతో సుమారు గంటసేపు చంద్రబాబు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎన్డీయే ఎంపీలతో కలిసి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. అంతకుముందే నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో సీఎం భేటీ అయ్యారు. శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. అలాగే కేంద్రమంత్రి రామ్‌దాస్ అఠావలెతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఫిక్కీ ఛైర్మన్, ప్రతినిధులను కలుస్తారు. భారత్‌లో జపాన్ రాయబారితోనూ సీఎం చర్చలు జరుపుతారు. సాయంత్రం పర్యటన ముగించుకుని దిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరి వస్తారు.