CM Chandrababu Media Conference: అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులంతా 1631 రోజులు ఆందోళన చేశారని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆందోళన విరమించారని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత రాజధాని రైతులకే దక్కుతుందన్న సీఎం, రైతుల పోరాటం భావితరాలకు ఆదర్శంగా నిలిచిపోతుందని కొనియాడారు.
ఏపీ అంటే అమరావతి, పోలవరం: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, ఐదు కోట్ల ప్రజానీకానికి దశ, దిశ నిర్దేశించే రాజధానిగా అమరావతి ఉందన్నారు. దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లు ఉండే నది గోదావరి అని, పోలవరం పూర్తి, నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే అవకాశం ఉందన్నారు. అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదన్న సీఎం చంద్రబాబు, ప్రజలందరి సంపద వారికే సొంతమని స్పష్టం చేశారు.
పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్న సీఎం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరాన్ని గోదారిలో కలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారిందని అన్నారు. తెలుగు జాతి గర్వంగా నిలబడేలా రాజధాని నిర్మాణం ఉండాలన్న సీఎం, కర్నూలును ఆధునిక నగరంగా తయారుచేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఆనాడు స్పష్టమైన విధానం తెచ్చామన్న చంద్రబాబు, రాజధానిపై నిత్యం విషప్రచారం చేశారని విమర్శించారు.
శ్వేతపత్రం విడుదల చేస్తాం: అమరావతి బ్రాండ్ దెబ్బతినేలా వ్యవహరించారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని విషప్రచారం చేశారని, మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడారని ధ్వజమెత్తారు. చివరికి రాజధాని అంటే ఏదో చెప్పలేని దుస్థితికి తెచ్చారన్న సీఎం, రాజధాని కోసం స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు భూమి ఇచ్చారని తెలిపారు. అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్న చంద్రబాబు, అమరావతి ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందని అన్నారు. అందరి ఆశీస్సులు, స్థల మహత్యమే అమరావతిని కాపాడాయని పేర్కొన్నారు.
ఇక్కడి అల్లరి మూకలు అమరావతి నమూనానూ విధ్వంసం చేశాయన్న చంద్రబాబు, ఐదేళ్లలో అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాప్రతినిధులు, ఐఏఎస్‌ల సముదాయాలు 80 శాతం పూర్తి చేశామని, అమరావతిలో ఐకానిక్ కట్టడాలన్నీ నిలిచిపోయాయని అన్నారు. విశాఖను ఆర్థిక రాజధాని, కర్నూలును మోడల్‌సిటీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ సహా రాష్ట్రంలో 11 కేంద్ర సంస్థలు నెలకొల్పామన్న చంద్రబాబు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి గతంలోనే ప్రణాళికలు తయారీ చేశామని గుర్తు చేశారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని తెలిపారు.
వైఎస్సార్సీపీ లాంటి పార్టీ రాజకీయాలకు అవసరమా: అమరావతికి జరిగిన నష్టంపై అంచనా వేస్తామన్న సీఎం చంద్రబాబు, వైఎస్సార్సీపీ లాంటి పార్టీ రాజకీయాలకు అవసరమా అని మండిపడ్డారు. ప్రజల జీవితాల్లో వెలుగు తెచ్చే బాధ్యత ప్రధాని, తనపై ఉందని అన్నారు. గతంలో సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారని, లేదంటే ఊరుకున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ తరహాలో విధ్వంసం చేసిన వ్యక్తి జగన్ తప్ప ఎవరూ లేరని ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములు చేస్తామని, తప్పు చేసిన వారిని నిర్మొహమాటంగా అణచివేస్తామన్నారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేద్దామంటే కుదరదని హెచ్చరించారు.