AP CM Chandrababu Missed Accident in Vijayawada : వరద ప్రాంతాల్లో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వరద ప్రవాహం పరిశీలించేందుకు విజయవాడలోని మధురానగర్ రైల్వే ట్రాక్ పైకి చంద్రబాబు వెళ్లారు. భద్రతా సిబ్బంది వారించినప్పటికీ వినకుండా రైలు వంతెనపై నడిచి బుడమేరును పరిశీలించారు. సరిగ్గా అదే సమయంలో ట్రాక్ పైకి ఓ ట్రైన్ దూసుకొచ్చింది. రైలు చూసి వెంటనే భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అతి సమీపం నుంచి రైలు వెళ్లింది. రైలు తగలకుండా ఓ పక్కకు నిలబడి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. రైలు దాటాక సీఎం సేఫ్గా బయటపడటంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన : రోజూలాగే ఇవాళ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. ఉదయం ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. అనంతరం బల్లకట్టుపై వెళ్లి ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలను సీఎం స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి వద్ద బుడమేరు కాలువపై వరద ఉద్ధృతిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. వరద తగ్గుముఖంపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. విజయవాడ నగరానికి భవిష్యత్లో ఇటువంటి విపత్తు మళ్లీ రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. బుడమేరులో వరద తగ్గిందని అధికారులు మరింత బాధ్యతగా పని చేయాలని సూచించారు. బుడమేరు కాలువ ప్రక్షాళన చేపడతామని, ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
గతంలో బుడమేరు ఆధునికీకరణ కోసం అధిక మొత్తంలో నిధులు కూడా కేటాయించడం జరిగిందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతరం విజయవాడ మధురానగర్ రైల్వే బ్రిడ్జి వద్ద ముంపు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. పలువురు స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ సహాయక చర్యలు అందుతున్న తీరును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే వరద ప్రవాహాన్ని చంద్రబాబు పరిశీలిస్తుండగా ట్రైన్ అకస్మాత్తుగా దూసుకురావడం, తక్షణమే సెక్యూరిటీ అప్రమత్తమవటంతో పెను ప్రమాదం తప్పింది.
జేసీబీలో చంద్రబాబు - డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా - AP CM Visits Flood Areas