AP BJP Leaders on Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించడం దౌర్భాగ్యమని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లా ప్రజల వరప్రదాయినిగా పేరుగాంచింది. ఈ ప్రాజెక్టుపై పలు ప్రశ్నలను సంధించిన బీజేపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదని, నిర్వాసితులను ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు సిరసనగండ్ల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు బాకీ ఉన్న 1800 కోట్ల రూపాయల పరిహారాన్ని బాధితులకు ఎప్పుడు చెల్లిస్తారని నిలదీశారు. ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తి కాకుండా, కొల్లం వాగు వద్ద హెడ్ రెగ్యులేటరీ పనులు పూర్తి చేయకుండా నీటిని ఎలా నిల్వ చేస్తారని ప్రశ్నించారు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌తోపాటు, అవసరమైన చోట్ల బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేశామని ముఖ్యమంత్రి చెప్పగలరా అని నిలదీశారు.
2009లో నిర్మించిన టన్నెల్, ప్రధాన డ్యామ్ మధ్య నిర్మించిన ఫీడర్ కెనాల్ పూర్తిగా మట్టితో నిండిపోయిందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే కనిగిరిలోని ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గుర్తు చేశారు. వెలిగొండ నిర్మాణం పూర్యయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి వద్ద ఫిబ్రవరి 2వ తేదీన మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కనిగిరి నిమ్జ్, దొనకొండ పారిశ్రామికవాడకు అనుమతులు ఇచ్చినా - భూమి అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వముందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దర్శిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కోసం రూ.50 కోట్లు మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో ప్రాజెక్టు వెనక్కి పోయిందని ఆరోపించారు.
కరవుతో రైతులు అల్లాడుతుంటే సీఎం జగన్ ప్యాలెస్లో కునుకు తీస్తున్నాడు : సీపీఐ రామకృష్ణ
కేంద్ర ప్రభుత్వం దొనకొండ వద్ద హెలికాఫ్టర్ ట్రైనింగ్ సెంటర్, నేవి నేవిగేషన్ సెంటర్ మంజూరు చేస్తే, కనీసం అవసరమైన భూమి మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గుండ్లకమ్మ నుంచి ఒంగోలు నగరానికి తాగు నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు మంజూరు చేసినా, ఆ పనులు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు.
"ప్రాజెక్టు నిర్వాసితులకు 1800 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలి. ఇది చెల్లించారా? దీనిపై రాష్ట్ర ప్రభుత్వ స్పష్టంగా చెప్పాలి. రివిట్మెంట్ పూర్తి చేయకుండా ప్రాజెక్టు పూర్తి చేశామని అంటే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా." - లంకా దినకర్, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి