AP Assembly Speaker Ayyanna Patrudu : శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో అధికారిక ప్రకటన తర్వాత సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా కూటమి సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన మెజారిటీతో ఎన్నికై చేపట్టిన అధికారం పదవి కాదని బాధ్యతగా గుర్తించాలని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. గడచిన ఐదేళ్లుగా రాష్ట్రం, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. శాసనసభా పతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం శాసనసభలో మాట్లాడిన అయ్యన్న, రాష్ట్ర ప్రజల కోసం వారి భవిష్యత్తు కోసం శాసనసభలో మాట్లాడాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సమావేశాల్లో రెండో రోజు స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభంకాగానే, ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పీకర్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. స్పీకర్ పదవికి, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. ఈ విషయాన్ని ప్రొటెం స్పీకర్ ప్రకటించగానే అయ్యన్న పాత్రుడును సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ శాసన సభా పక్ష నేతలు కలిసి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు.
వైఎస్సార్సీపీ నేతలు కూడా ఈ ప్రక్రియకు హాజరు కావాల్సి ఉన్నా వారంతా గైర్హాజరు కావటంతో శాసనసభలోని పక్షనేతలంతా ఆయన్ను సభాపతి స్థానానికి తోడ్కొని వెళ్లారు. అంతకుముందు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి అయన ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ప్రకటించారు. ఆ తర్వాత సభా నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పీకర్ గురించి ప్రసంగించారు.
CM Chandrababu Comments On Speaker Ayyanna Patrudu : అసెంబ్లీలో అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్నపాత్రుడు ఒకరని సీఎం చంద్రబాబు అన్నారు. స్పీకర్‌గా అయ్యన్న ఎన్నిక అనంతరం ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషమన్నారు. ‘‘66 ఏళ్ల వయసు ఉన్నా అయ్యన్న ఇప్పటికీ ఫైర్ బ్రాండే. నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికి పుచ్చుకొని రాజకీయాలు చేశారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఆయనపై అనేక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టి వేధించారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారు. ఆయన చట్టసభకు రావడం అరుదైన గౌరవం. మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలి. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుంది" అని సీఎం చంద్రబాబు అన్నారు.
మరోవైపు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్, బీజేపీ నేతలతో పాటు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని స్పీకర్ అయ్యన్న వ్యాఖ్యానించారు. గతంలో శాసనసభ గౌరవాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన వారిని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తానని అన్నారు. ఎంతో పవిత్రంగా నడపాల్సిన సభను ఇబ్బందికరంగా మార్చారని అయ్యన్న వ్యాఖ్యానించారు. 16 శాసనసభ కు 22 మంది మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేలా వారికి సీట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ పార్టీకి అభినందనలు తెలియచేయాలన్నారు.
స్పీకర్‌కు సంబంధించి ఇతర ఎమ్మెల్యేలు (MLA) లు కూడా సీఎం ప్రసంగాన్ని బలపరిచారు. సభ్యులు మాట్లాడిన తర్వాత సభాపతి సమాధానం ఇచ్చారు. తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.