AP Assembly Discussion on Aurobindo Company : 108 మాటున అరబిందో భారీ అక్రమాలకు పాల్పడిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీలో ఆధారాలు బయటపెట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేకపోయాయని మండిపడ్డారు. 34 లక్షల మందికి గాను 17.8 లక్షల మందికి గోల్డెన్ అవర్ రీచ్ కాలేకపోయాయని ఆడిట్ జనరల్ తప్పుపట్టిందన్నారు. 61 శాతం అంబులెన్స్‌లలో సెలైన్ల కొరత ఉండటంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కొరత ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని గుర్తుచేశారు.
విజయసాయి రెడ్డి అల్లుడుకి చెందిన అరబిందోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అరబిందో 430 అంబులెన్స్‌లు నడిపి 720 అన్నట్లు ఆప్లోడ్ చూపించారని నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో అంబులెన్స్‌లకు ఈ చట్టాలు వర్తించవా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకున్న సంస్థపై గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్‌గా మారిపోయింది - వారిపై చర్యలు తీసుకోవాలి'
గోల్డెన్ అవర్ ప్రమాణాలను పాటించలేదు: రాష్ట్రంలో అరబిందో సంస్థ నిర్వహిస్తున్న అంబులెన్సులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. గోల్డెన్ అవర్ ప్రమాణాలను ఎక్కడా పాటించలేదని, తద్వారా వేల మంది ప్రాణాలు తీసిందని ఆక్షేపించారు. అలాగే అంబులెన్సుల్లో అత్యవసర ఔషధాలేవీ లేకుండానే కాలం గడిపేసిందని శాసనసభలో వ్యాఖ్యానించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల అనంతరం ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై సోమిరెడ్డి మాట్లాడారు.
ప్రస్తుతం నిర్వహిస్తున్న పాత అంబులెన్సులకు కూడా నెలకు 2.25 లక్షల రూపాయల్ని ప్రభుత్వం నుంచే వసూలు చేస్తున్నారని ఆక్షేపించారు. కేవలం విజయసాయి రెడ్డి బంధువుగా ఉండి గత ప్రభుత్వ హయాంలో టెండరు పొందిన అరబిందో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.
గత పాలకులు ప్రజల ఆదాయం పెంచలేదు - అప్పులు పెంచారు : సీఎం చంద్రబాబు
అంబులెన్స్‌లు అత్యవసర సేవలు అందించలేదు: ఈ వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా అటు సీనియర్ శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్ర, బుచ్చయ్య చౌదరి కూడా డిమాండ్ చేశారు. 336 పాత వాహనాలనే వినియోగించి ప్రభుత్వ సొమ్మును కాజేశారని సభ్యులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రహదారి ప్రమాదాలు, ట్రామా పరిస్థితుల్లోనూ అంబులెన్సులు సరైన సమయానికి వచ్చిన పరిస్థితి లేదని అన్నారు. 2021లో 7.84 లక్షల కేసులు నమోదు అయితే కేవలం అంబులెన్సులు 2.4 లక్షల కేసులు మాత్రమే నిర్వహించినట్టు తేలిందన్నారు. కేవలం దోపిడికీ మాత్రమే ఈ అంబులెన్సులను అరబిందో వాడుకుందని సభ్యులు ఆరోపించారు.
సభ్యులు చేసిన ఆరోపణలు నిజమేనని మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ఇప్పటి వరకు అరబిందోకు 600 కోట్ల చెల్లింపులు జరిగాయని, మరో 800 కోట్లు పైచిలుకు చెల్లింపులు చేయాల్సి ఉందని వెల్లడించారు. అయితే నిర్వహణా లోపంపై అరబిందోకి నోటీసులు జారీ చేసినట్టు మంత్రి తెలిపారు. ఔషధాల కొరత, ఫెమా ఉల్లంఘనలు, బయోమెడికల్ వేస్టు నిర్వహణ, రోడ్ ట్యాక్స్ కట్టకపోవటం లాంటి వ్యవహారాలపై విచారణ చేయిస్తామని మంత్రి శాసన సభకు వివరించారు. అంబులెన్స్‌ల విషయంలో నిర్లక్ష్యంతో పాటు దోపిడీ కూడా జరిగిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టంచేశారు. ఏం చర్యలు తీసుకుంటున్నారో సభకు, ప్రజలకు తెలియాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని పథకం ఇది - కోటిన్నర మందికి లబ్ధి : మంత్రి నాదెండ్ల