Financial Assistance to SI Sriramula Srinu Family : తోటి సిబ్బంది వేధిస్తున్నారంటూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ కుటుంబానికి సహచర పోలీసులు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీస్ వెల్ఫేల్ సొసైటీ-2014 బ్యాచ్‌కు చెందిన 746 మంది ఎస్సైలంతా కలిసి 25 లక్షల రూపాయల చెక్కును శ్రీనివాస్ కుటుంబానికి అందించారు.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటలోని తన నివాసానికి వెళ్లిన అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సైగా పనిచేసిన శ్రీనివాస్, నలుగురు కానిస్టేబుళ్లు, సీఐ వేధిస్తున్నారంటూ ఇటీవల పురుగుల మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 7న మృతి చెందాడు.
Police Helps to SI Srinivas Family : శ్రీనివాస్‌కు భార్య కృష్ణవేణి, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఎవరూ అఘాయిత్యాలకు పాల్పడొద్దని ఏపీ, టీజీ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వెల్లడించారు. సమస్య వస్తే 2014 బ్యాచ్‌కి చెందిన ఎస్సైలంతా తోడుగా ఉంటామని స్పష్టం చేశారు.
తమ బ్యాచ్‌కు చెందిన ఎస్సైలు అందరూ డబ్బులు పోగు చేసి శ్రీనివాస్ కుమారుడు పేరు మీద రూ.10 లక్షల డిపాజిట్, కుమార్తె పేరు మీద రూ.10 లక్షల డిపాజిట్, అదేవిధంగా అమ్మ పేరు మీద రూ.5 లక్షల జమ చేశామని తెలిపారు. ఎస్సైగా ఉంటూ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో 100 మంది వరకు ఎస్సైలు పాల్గొన్నారు.
"ఉద్యోగంలో పని ఒత్తిడి ఏమైనా ఉంటే తోటి బ్యాచ్‌మేట్స్‌తో పంచుకోవడమో, లేదా సమస్య పరిష్కారానికి సరైన మార్గమో అన్వేషించాలి. అంతేకానీ తొందరపాటు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోకూడదు. ఇకముందు ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా మా బ్యాచ్ అంతటికీ మోటివేట్ చేస్తున్నాం. అలానే ఇలాంటి విషయాలపై కచ్చితమైన చర్యల కూడా తీసుకుంటాం. ఇవాళ ఇరు రాష్ట్రాల నుంచి మా బ్యాచ్‌కు చెందిన ఎస్సైలమంతా, శ్రీనివాస్ ఫ్యామిలీకి కొంత ఆర్థిక మద్దతు ఇచ్చాం." -శ్రీధర్, ఏపీ, టీజీ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అశ్వారావుపేట ఎస్సై మృతి - ఆ ఐదుగురిపై కేసు నమోదు - Ashwaraopet si died