ACB Raids in RTA Offices in Telangana : ఆర్టీఏ శాఖలో భారీ స్థాయిలో అవినీతి జరుగుందన్న విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అనిశా అధికారులు, భారీ స్థాయిలో సొత్తును, నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మలక్‌పేట్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారులు సోదాలు నిర్వహించడంతో పోలీసులు దరఖాస్తుదారులను నిలిపివేశారు. పాతబస్తీలోని బండ్లగూడ, టోలీచౌకీ, మలక్‌పేటలోని ఈస్ట్ జోన్ వద్ద ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి, పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కార్యాలయంలో అనధికారికంగా ఉన్న ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. ఏజెంట్ల నుంచి రూ.45,100 నగదు, డ్రైవర్ నుంచి రూ.16,500 నగదు, నూతన లైసెన్సులు,రెనివల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన కాగితాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పని చేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యం అయిందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు తెలిపారు.
బాసు లంచం అడిగావో జైలు ఖాయమంటున్న ఏసీబీ అధికారులు
గత కొన్ని రోజులుగా మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందాయి. డీజీ సి.వి.ఆనంద్ ఆదేశాలతో ఈ దాడులు నిర్వహించాం. కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావులను అదుపులో తీసుకున్నాం. వీరి నుంచి నగదు, పలు కాగితాలను స్వాధీనం చేసుకున్నాం. ఏజెంట్లు, డ్రైవర్లు, అనధికార వ్యక్తులు కార్యాలయంలో ఉండకూడదు. డీడీలు, చెక్కులే ఉండాలి. అందుకు విరుద్ధంగా వీరి వద్ద నగదు ఉంది. ఆ నగదును స్వాధీనం చేసుకున్నాం. పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. - సాంబయ్య, ఏసీబీ డీఎస్పీ
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయంలోనూ తనిఖీలు జరిగాయి. మహబూబ్‌నగర్ ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉమ్మడి జిల్లా పర్యవేక్షణాధికారి కార్యాలయానికి చేరుకున్న అధికారులు, పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో ఉండే సిబ్బంది, చేస్తున్న పనులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారన్న సమాచారం అందుకున్న పలువురు ఏజెంట్లు తమ దుకాణాలు మూసివేశారు.
బంగారం, నగదు, గంధపు దుంగలు.. ప్రభుత్వాధికారుల బాగోతం బట్టబయలు...
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోనూ ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీఎస్పీ రేంజ్ అధికారితో పాటు సుమారు 15 మంది అధికారులతో కూడిన బృందం ఈ దాడుల్లో పాల్గొన్నారు. కార్యాలయంలోని కంప్యూటర్లను, రిజిస్టర్లను, కీలక ఫైల్స్‌ను క్షుణ్నంగా పరిశీలించారు. ఈ దాడులతో రవాణా శాఖ కార్యాలయ సమీపంలో ఉన్న ఏజెంట్లు వారి కార్యాలయాలను మూసివేశారు.