Annavaram Prasadam: కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదానికి భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ.(FSSAI) గుర్తింపు దక్కింది. సురక్షిత, ఆరోగ్యకరమైన ఆహార లభ్యతను నిర్ధారిస్తూ స్వామి గోధుమ నూక ప్రసాదానికి ఈ గుర్తింపును ఈట్ రైట్, ప్లేస్ ఆఫ్ వర్షిప్ విభాగం ద్వారా అందించింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చేతుల మీదుగా దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో రామచంద్ర మోహన్ లకు ధ్రువీకరణ పత్రాన్ని జేఎన్టీయూకే స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ విభాగాధిపతి రమేష్ సమక్షంలో అందజేశారు. రెండేళ్ల కాలానికి ఈ పత్రాన్ని ఇచ్చారు. ఎఫ్ ఎస్ ఏ ఐ గుర్తింపునకు 2022 ఆగస్టులోనే దేవస్థానం తరపున దరఖాస్తు చేశారు. సత్యదేవుని గోధుమనూక ప్రసాదం తయారీ, నిల్వ చేసే విధానం, ప్యాకింగ్ కు పాటిస్తున్న ప్రమాణాలు, ప్యాకింగ్ సిబ్బంది వ్యక్తిగత శుభ్రత తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు పరిశీలించారు.
భక్తుడి కానుక - అన్నవరం దేవాలయ ధ్వజస్తంభం స్వర్ణమయం - Annavaram Dwajasthambam Gold Coated
ప్రసాదం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనంతరం జేఎన్టీయూకే, రాష్ట్ర, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఆర్థిక సహాయంతో ఈ గుర్తింపు దక్కింది. స్వామి ప్రసాదాన్ని గోధుమలు, పంచదార, నెయ్యి, యాలకులతో మధురంగా తయారు చేస్తారు. 150 గ్రాముల బరువు తో ప్రసాదాన్ని రూ.20కి దేవస్థానంలో భక్తులకు విక్రయిస్తున్నారు. ఏటా సుమారు కోటిన్నర నుంచి రెండు కోట్లు ప్యాకెట్లు విక్రయిస్తున్నారు. దీని ద్వారా దేవస్థానానికి ఏటా రూ.30 కోట్లు ఆదాయం వస్తుంది. పూర్వం నుంచి పాటిస్తున్న సంప్రదాయానికి అనుగుణంగా గిరిజన ప్రాంతాల నుంచి సేకరించే విస్తరాకులోనే అన్నవరం స్వామి ప్రసాదాన్ని ప్యాక్ చేసి భక్తులకు అందిస్తున్నారు.