Consultative forum in Andrapradesh : రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెట్టుబడిదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ ఉమ్మడి భాగస్వామ్యంతో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ పరిశ్రమల శాఖ జీవో నెంబర్ 58ని విడుదల చేసింది. విజయవాడలో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ రీజనల్ కౌన్సిల్ సదస్సులో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. పెట్టుబడిదారులు నేరుగా ప్రభుత్వంతో చర్చించేందుకు కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఐఐ ప్రతినిధులు కోరారు. దీంతో వారం రోజుల్లో కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ మధ్య కన్సల్టేటివ్ ఫోరం ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసి ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. ప్రాథమికంగా రెండేళ్ల కాలపరిమితితో ఈ ఫోరం పనిచేయనుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించనుంది. ఆర్టీజీఎస్ మంత్రిగా ఉన్న లోకేశ్ ఈ ఫోరం ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య ఆర్టీజీఎస్ సమన్వయం చేయనుంది. రాష్ట్రంలో పెట్టుబడుల అనుకూల వాతావరణం, పారిశ్రామికవేత్తలకు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కోసం ఇప్పటికే ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును ప్రభుత్వం పునరుద్ధరించింది. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.